ఏఐ, కాన్వా కోర్సులో ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థిని వైష్ణవి
బెజ్జూర్: మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని వైష్ణవి వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ ) కాన్వా కోర్సులను నేర్చుకొని తన సొంతంగా పోస్టర్లు, డిజైన్లు రూపొందించింది. ఇంపాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అన్ని అసైన్‌మెంట్లు, హోంవర్క్‌లు పూర్తి చేసి, నిర్వహించిన పరీక్షలో ద్వితీయ స్థానం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, వార్డు సభ్యులు గ్రామస్తుల సమక్షంలో వైష్ణవికి బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు.
తల్లిదండ్రులు తుమ్మెడె లక్ష్మీనారాయణ, శారద దంపతులను ప్రత్యేకంగా సన్మానించారు. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని నేర్చుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరినీ గ్రామ ప్రజలు అభినందించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ఏఐ వంటి ఆధునిక రంగాల్లో రాణించగలరని వైష్ణవి నిరూపించింది.ఇంపాక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ దుర్గా, ఇంపాక్ట్ క్లబ్ అధ్యక్షురాలు కుడ్మేత చెంచులక్ష్మి మాట్లాడుతూ... "మారుతున్న టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ తెలియాలి.
వెనుకబడిన ప్రాంతాల పిల్లలు కూడా ఏఐ, కాన్వా వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము" అని తెలిపారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు "పేదరికం అడ్డంకి కాదు – ఆలోచన మార్చుకుంటే జీవితం మారుతుంది" అనే సందేశాన్ని అందిస్తూ, పిల్లలకు డబ్బు కంటే ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహం సరైన మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని వివరించారు.తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలను అర్థం చేసుకొని వారిని ప్రోత్సహిస్తే గ్రామ పిల్లలు కూడా ఉన్నత శిఖరాలను చేరుకోగలరని తెలిపారు.






