22-05-2025 09:26:17 AM
విజయవాడ: నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్(Vallabhaneni Vamsi Mohan) కేసులు విచారణ జరగనుంది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నూజివీడు కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వంశీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ చేపట్టనుంది. మైనింగ్ కేసులో పిటీ వారెంట్ ఇవాళ వరకు అమలు చేయబోమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది.
వల్లభనేని వంశీ మోహన్ సోమవారం ఏపీ హైకోర్టు(High Court Of Andhra Pradesh)లో ముందస్తు బెయిల్ కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు దిగువ కోర్టు నుండి పిటి వారెంట్ పొందకుండా నిరోధించాలని కోరారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 195 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ గన్నవరం పోలీసులు(Gannavaram Police) వంశీపై కేసు నమోదు చేశారు. వంశీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్, పోలీసులు కేసు నమోదు చేశారని, ఆయన జైలు నుంచి విడుదల కాకుండా నిరోధించడానికి వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు పిటి వారెంట్ కోరకుండా నిరోధించాలని ఆయన కోర్టును కోరారు. పోలీసుల తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, కేసు తగిన ప్రక్రియ ప్రకారం నమోదు చేయబడిందని, ఎప్పుడైనా శిక్షార్హమైన నేరాలు నమోదు చేయవచ్చని అన్నారు. నకిలీ భూ రికార్డుల కేసులో నిందితుడిగా ఉన్న వంశీ పేరును వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చార్జిషీట్ నుండి తొలగించారని ఆయన అన్నారు.