calender_icon.png 22 May, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒత్తిడి తట్టుకోలేక.. జనరల్ ఆస్పత్రి వైద్యుడి రాజీనామా.!

22-05-2025 01:40:20 PM

- ఓ పక్క కొరవడిన వసతులు, మరోపక్క రోగుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి.

- ఆస్పత్రి సూపరింటెన్డెంట్ నుంచి నిత్యం అవమానాలు. 

 జనరల్ ఆస్పత్రిలో గందరగోల వాతావరణం.

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి):  నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి(Nagarkurnool General Hospital)లో గందరగోల వాతావరణం నెలకొంది. ఓ పక్క కనీస వసతులకు నోచుకోకుండా రోగుల తాకిడి పెరగడంతో వైద్యులు తీవ్ర సతమతం అవుతూ ఒత్తిడికి లోనవుతున్నారు. ఆస్పత్రి పర్యవేక్షకుడి నుంచి కూడా వైద్యులకు నిత్యం అవమానాలే ఎదురవుతుండడంతో మనోవేదన గురై కొందరు డాక్టర్లు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎముకల వైద్యులు డాక్టర్ అఖిల్(Dr. Akhil) తన రాజీనామా పత్రాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రి సూపర్ఇంటెండెంట్ డాక్టర్ రచ్చ రఘుకి అందజేశారు. దీంతో తోటి వైద్య బృందంతో పాటు రోగులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. జనరల్ ఆస్పత్రి వైద్యులపై గత కొంతకాలంగా సూపరింటెండెంట్ రఘు ఆంక్షలు విధిస్తూ పెత్తనం చెలాయిస్తుండడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఇతర వైద్యులు పేర్కొన్నారు.

రోజురోజుకు రోగుల తాకిడి భారీగా పెరుగుతుండడంతో సిజేరియన్ డెలివరీలు(Cesarean deliveries), నార్మల్ సర్జరీ లతోపాటు (ఎముకలు వైద్యం) ఆర్తో సర్జరీలు కూడా అమాంతం పెరిగాయి. ఆర్తో వార్డులోని ఏదైనా ఒక రోగి పూర్తిగా నయమై ఇంటికి వెళ్తేనే మరో రోగికి అవకాశం వచ్చే పరిస్థితి దాపురించింది. ఆస్పత్రిలో కేవలం రెండు ఆపరేషన్ థియేటర్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఒకటి డెలివరీలు, మరొ ఆపరేషన్ థియేటర్లో సాధారణ ఆపరేషన్ లతోపాటు ఆర్తో సర్జరీలు కూడా విడతలవారీగా రోజు విడిచి రోజు అక్కడే జరుగుతున్నాయి. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి ఫామ్ అవుతూ రోగులకు కొత్త రోగాలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. మరికొన్ని ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తేవలసి ఉంది.

ప్రస్తుతం మెడికల్ కళాశాల వద్ద నిర్మితమవుతున్న నూతన భవనంలోకి ఎమర్జెన్సీ వార్డు(Emergency ward) మరికొన్ని వార్డులను షిఫ్ట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోగులకు వైద్యం అందిస్తున్న జనరల్ ఆసుపత్రిలో మాత శిశు సంరక్షణ కేంద్రం ప్రసవాలు ఇతర వైద్యం అందుబాటులోకి రానుంది. కనీసం ఆయా వార్డుల్లోనీ మరుగుదొడ్లు మూత్రశాలల్లో నీటి సదుపాయం కూడా కల్పించడంలో విఫలమయ్యారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు ఇప్పటికే చేయాల్సి ఉన్నప్పటికీ జనరల్ ఆస్పత్రి సూపర్ ఇంటెండెంట్ నిర్లక్ష్యం కారణంగా ఈ పనులు ఏవి ముందుకు సాగడం లేదని విమర్శలు ఉన్నాయి.

దీంతోపాటు వ్యక్తిగతంగా నిస్వార్ధంగా రోగుల కోసం పనిచేస్తున్న వైద్యులను టార్గెట్ చేస్తూ వారిపై దూషణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు ఇతర వైద్య బృందం ఆరోపిస్తోంది. తాను పర్యవేక్షణ మరిచి నిస్వార్ధంగా పనిచేస్తున్న వారిపై ఇబ్బందులకు గురి చేయడం ఇతర ప్రైవేటు ఆసుపత్రులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వైద్యులు తమలోనే తాము తీవ్ర ఇబ్బందులకు లోనవుతూ మరికొందరు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఇతర వైద్యులు కోరుతున్నారు.