వందేమాతరం.. జాతి ఆత్మగౌరవం
- బ్రిటిష్ కుట్రలను తిప్పికొట్టిన అస్త్రం
- నిజాం సర్కార్‌ను గడగడలాడించిన ఉద్యమం
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- వివేక వర్ధిని కాలేజీలో వందేమాతర గీత 150వ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): ‘వందేమాతరం అనేది కేవ లం రెండు పదాలు కాదు. భారత జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. మన పూర్వీకుల స్వార్థం లేని త్యాగానికి నిలువుటద్దం. దురదృష్టవశాత్తు కొందరు దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నారు.
వందేమాతరం ఏ ఒక్క రాజకీ య పార్టీ నినాదం కాదు. దేశ సమైక్యతను చాటిచెప్పే స్ఫూర్తి మంత్రం’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వందేమాతర గీతం 150 సంవత్సరా లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని కోఠి వివేకవర్ధిని కళాశాల ప్రాంగణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ప్రత్యేక ఫొటో ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కీలక ప్రసంగం చేశారు.
సుమారు 150 ఏళ్ల క్రితం మహాకవి బంకించంద్ర చటర్జీ భారతమాత ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా ఈ గీతాన్ని సృష్టించారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు విధానంతో దేశాన్ని చీల్చాలని చూసినప్పుడు, భారతీయులందరినీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏకం చేసింది ఈ గీతమేనని పేర్కొన్నారు. 1905 బెంగాల్ విభజన మొదలు.. 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రతి పోరాటంలోనూ వందేమాతర గర్జన మార్మోగిందని, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చివరి శ్వాసలోనూ ఇదే నినాదం ఉందని గుర్తు చేశారు.
వందేమాతర ఉద్యమానికి హైదరాబాద్ గడ్డతో విడదీయరాని అనుబంధం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. 1938లో నిజాం నిరంకుశ పాలనలో వందేమాతరంపై నిషేధం విధించారని, ఈ గీతం ఆలపించిన విద్యార్థులను కాలేజీల నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు.
అయినా వెరవకుండా పోరాడారని, ఆ పోరాట స్ఫూర్తితోనే రామచంద్రరావు ఇంటిపేరు వందేమాతరం’గా మారిపోయింది అని నాటి ఉద్యమ చరిత్రను వివరించారు. ప్రధాని మోదీ సంకల్పించిన వికసిత భారత్ నిర్మాణానికి వందేమాతరం కొత్త శక్తిని ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. 150 ఏళ్ల వందేమాతర గీత ఉత్సవాల సందర్భంగా నవభారత పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.






