నేడే వరుణయాగం
- నాగార్జునసాగర్ తీరాన మహాక్రతువు 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలు
- రోజంతా వైదిక కార్యక్రమాలు కృష్ణా, గోదావరి బేసిన్లలో విస్తారంగా వర్షాలే లక్ష్యం
- ప్రాజెక్టులు, చెరువులు నిండాలని సంకల్పం
- మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో మహా వరుణయాగం హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి) : నైరుతి సగం గడిచినా కృష్ణా, గోదావరి నదులకు సరైన ప్రవాహాలు లేవు. సాగు భూములు బీళ్లుగా మారా యి. రాష్ట్రంపై కరువు మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో వరుణుడి కటాక్షం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైదిక బాట పట్టి ంది. నదులు నిండుగా ప్రవహించి, జలాశయాలు కళకళలాడాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ నాగార్జునసాగర్ కృష్ణా తీరాన సోమవారం మహా వరుణయాగం నిర్వహించనుంది. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ యాగానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
తెలంగాణతోపాటు కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి జనలవనరులు సమృద్ధిగా మారాలన్నదే ఈ యాగం ప్రధాన సంకల్పం. యాగ నిర్వహణకు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ ప్రాంగణంలో 11 హోమగుండాలు ఏర్పాటు చేశారు. 108 మంది రుత్వికులు, అర్చకులు, వేదపండితులు హాజరై రోజంతా వైదిక క్రతువులు చేపట్టనున్నారు. యాగ నిర్వహణకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సిద్ధాంతి, అర్చకులు, వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు.
ఎగువ రాష్ట్రాల వర్షాలే కీలకం..
తెలంగాణ జలభద్రత కేవలం రాష్ట్రంలో నమోదయ్యే వర్షపాతంపైనే ఆధారపడి ఉండదు. కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలు అత్యంత కీలకం. కృష్ణా పరీవాహక ప్రాంతం సుమారు 2.59 లక్షల చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉండగా, ఇందులో 44 శాతం కర్ణాటకలో, 27 శాతం మహారాష్ట్రలో ఉంది. అంటే కృష్ణా పరీవాహకంలో 70 శాతానికిపైగా ఎగువ రాష్ట్రాల్లోనే విస్తరించి ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల్లోని పశ్చిమ కనుమలు, కృష్ణా, భీమా, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలే ఆల్మట్టి, నారాయణపూర్ మీదుగా జూరాలకు..
అక్కడి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వచ్చే ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి. గోదావరి విషయంలోనూ ఇదే పరిస్థితి. సుమారు 3.13 లక్షల చదరపు కిలో మీటర్ల గోదావరి బేసిన్‌లో దాదాపు 49 శాతం మహారాష్ట్రలోనే ఉంది. నాసిక్, మరాఠ్వాడాతో పాటు ఎగువ, మధ్య గోదావరి ప్రాంతాల్లో కురిసే వర్షాలు తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులకు వచ్చే ప్రవాహాలపై ప్రభావం చూపుతాయి.
కృష్ణా ఆధారిత ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ..
ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఆల్మట్టికి 1,05,332 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 86,155 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మటి సామర్థ్యం 129.72 టీఎంసీలకు గాను 113.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్‌కు 42 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 18,654 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణలోకి కృష్ణా ప్రవాహాలకు ముఖద్వారంగా ఉన్న జూరాలకు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా, అక్కడి నుంచి 46,543 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. జూరాల సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా 8.07 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలంలో 215.807 టీఎంసీలకు గాను ౧౮౧.౦౫ టీఎంసీల నీరు ఉంది. ఇంకా 35.91 టీఎంసీల ఖాళీ సామర్థ్యం ఉంది.
సాగర్.. సగానికి పైగా ఖాళీ..
వరుణ యాగానికి వేదికగా మారుతున్న నాగార్జునసాగర్ భారీ ప్రవాహాల కోసం ఎదురుచూస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా 145.65 టీఎంసీలు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 166.39 టీఎంసీల నీరు అవసరం. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 518 అడుగుల వద్ద ఉంది. గత ఏడాది ఆగస్టు 9న 310.25 టీఎంసీల నిల్వ ఉండగా, నీటిమట్టం 589.40 అడుగుల వద్ద ఉంది. అంటే దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ ఏడాది అదే తేదీకి జలాశయంలో గతేడాది నిల్వలో సగానికంటే తక్కువ నీరే ఉంది.






