10 August, 2026 | 2:49 AM

జలాశయాలకు జలకళ

10-08-2026 01:38 AM
  1. కృష్ణా, గోదావరి బేసిన్లలో కొనసాగుతున్న వరద
  2. శ్రీశైలానికి 44,276 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  3. 181 టీఎంసీల నీటి నిల్వ

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర ద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రధాన జలాశయాలు క్రమంగా జలకళను సంతరించుకుంటున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండటంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఈ ప్రభావంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్  ప్రాజెక్టులకు నీటి చేరిక పెరిగింది. జూరాలకు 1,59,318 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా దిగువకు 44,276 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 9.66 టీఎంసీలకు గాను 7.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా బేసిన్‌లో కీలకమైన శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఆదివారం 44,276 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో ఉండగా, జలాశయంలో నీటి నిల్వ 181.05 టీఎంసీలకు చేరింది.

విద్యుత్ ఉత్పత్తి కోసం 60,177 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో నీటి నిల్వలు మెరుగుపడటంతో దిగువన్న ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటి లభ్యత పెరుగుతోంది. మరోవైపు గోదావరి బేసిన్‌లోనూ శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి సహా పలు జలాశయాలకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరగటంతో సాగునీటి అవసరాలకు ఊరట లభించే పరిస్థితి కనిపిస్తోంది.