భద్రకాళి ఆలయంలో ఘనంగా వసంతోత్సవం
వరంగల్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు పదవ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తిచేసి చతుస్థానార్చన జరిపిన తర్వాత అమ్మవారికి వసంతోత్సవం నిర్వహించారు.
ఉదయం విమానక సేవ (సర్వభూపాల వాహన సేవ), సాయంకాలం చతురన్తసేవపై అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారికి బలి ఉత్సవం జరిపిన పిమ్మట విమానక సేవ వైభవంగా నిర్వహించారు. సాయంకాలం చతురంతసేవ కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో ఈ రోజు ఉభయదాతలుగా హైదరాబాదు వాస్తవ్యులు అమంచి నాగపరిమళ శ్రీనివాస రావు దంపతులు, రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆవూనూరి రాంమూర్తి ఆధ్వర్యంలో అనేకమంది కుమ్మరి కుల పెద్దలు అమ్మవారికి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజాద్రవ్యములు శిరస్సు మీద ధరించి మేళతాళాలతో వేదస్వస్తితో గుడిలోనికి ప్రవేశించి అమ్మవారికి సమర్పించారు.
అనంతరం అమ్మవారికి షోడశోపచారపూజ జరిపి అమ్మవారి అనుజ్ఞతో స్నపనమండపంలోకి ప్రవేశించి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. తదుపరి నారీమణులచే అమ్మవారికి కుంకుమార్చన జరుపబడిన తర్వాత హోమం జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి వాహన సేవ నిర్వహించారు. సాయంకాలం సర్వభూపాల వాహన సేవ కూడా వైభవంగా నిర్వహించారు.






