డాక్టర్ బాలు కు వాసవి నవరత్న అవార్డు
కామారెడ్డి,(విజయక్రాంతి): రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త బుధవారం అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందజేశారు.
అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ వాసవి నవరత్న అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.






