వేదగిరి ఆలయానికి మళ్లీ పూర్వ వైభవం..
- గురు నిలయానికి భూమి పూజ..
- వైభవంగా గిరిప్రదక్షిణ
- పాల్గొన్నా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్ మే 12 (విజయక్రాంతి) : ఒకప్పుడు సకల దేవతల ఆలయాలకు ప్రసిద్ధి చెందిన వేదగిరి ప్రస్తుతం మళ్ళీ పూర్వవైభవం పొందడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జిల్లేడు చౌదరిగుడా మండలం వేదగిరి కొండపై హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ గిరిప్రదక్షిణ, గురు నిలయానికి భూమి పూజ వంటి కార్యక్రమాలు చేపట్టారు. వేదగిరి వేద పీఠం వ్యవస్థాపకులు మర్రి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదగిరి పై వెలసిన వేదాంజనేయ స్వామి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. భారీ ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఈ కార్యక్రమం ప్రత్యేక అతిథిగా అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాస్వామి కూడా హాజరయ్యారు.
ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తులను ప్రశాంత వాతావరణం వైపు నడిపించి జీవితంలో ఉన్నతికి ఎదిగేలా ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఉదయం 6:30 గంటలకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ ర్యాలీ ద్వారా వేలగిరి చేరుకొని అక్కడ 8:02 గంటలకు గిరిప్రదక్షిణ నిర్వహించారు. అదేవిధంగా 10:30 కి సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో వేదగిరి దేదీప్యమానంగా వెలిగేలా తీర్చిదిద్దనున్నట్లు డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి తెలిపారు .
అతి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం..
షాద్ నగర్ నియోజకవర్గంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒకప్పుడు వేదగిరి వెలుగు వెలిగిందని, ఇప్పుడు మళ్లీ మర్రి కృష్ణారెడ్డి సహకారంతో పూర్వ వైభవం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను పెంచుతాయని, అందుకే ఆలయాలకు నిరంతరం తన సహకారం ఉంటుందని వెల్లడించారు. యాదగిరి ఆలయాన్ని కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన వెల్లడించారు.
విశాలమైన స్థలంలో ప్రశాంతమైన కొండమీద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన వేదగిరి భవిష్యత్తులో పర్యాటక క్షేత్రం గా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్త బృందం హాజరయ్యారు. కొందుర్గు,చౌదరి కూడా మండలాల కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.






