కూరగాయల ధరలకు రెక్కలు
కూరగాయల ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకు ఆకాశన్నంటుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కూరగాయల సాగు భారీగా పడిపోయింది. అదే సమయంలో దిగుబడి కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో డిమాండ్ పెరిగి ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెరిగన కూరగాయల ధరలు భారంగా మారాయి.
20 రోజుల క్రితం వరకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు మూడింతలకు పైగా పెరిగిపోయాయి. దీంతో ఒక్కో కుటుంబంపై అదనంగా వెయ్యి రూపాయలపైనే భారం పడుతోంది. నెల రోజుల క్రితం వరకు టమాటా కిలో రూ.10-15 వరకు ఉండగా ప్రస్తుతం రూ.20-50 వరకు పలుకుతోంది. పచ్చిమిర్చి కిలో రూ.60-100, బెండకాయలు కిలో రూ.50 వరకు పెరిగాయి. కాకర రూ.40-80, వంకాయలు రూ.30, పాలకూర రూ.50కి చేరుకుంది.
క్యాబేజీ కిలో రూ.50, క్యారెట్ రూ.80, బీట్‌రూట్ రూ.50, మునక్కాయలు రూ.100, కొత్తిమీర రూ.100, అలుగడ్డలు రూ.40, చిక్కుడు రూ.60, చుక్క కూర రూ.30, ఉల్లిగడ్డలు రూ.25కు చేరుకున్నాయి. ఇలాగే రెండింతల నుంచి మూడింతలు ధర పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని కూరగాయల మార్కె ట్లో కొనుగోళ్లు తగ్గిపోయి, చిరు వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెరిగిన ధరలతో కూరగాయల అమ్మకాలను కూడా తగ్గించుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులను పెంచి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
కామిడి సతీశ్‌రెడ్డి, 9848445134,
జయశంకర్ భూపాలపల్లి






