కల్లాల్లో ఎదురుచూపులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రైతులు పండించిన మొక్కజొన్న, వరి వంటి పంటలు కలాల్లో కొనుగోలు చేయక తడిసిపోతుంటే, మరో పక్క ప్రగతి పాలన పేరిట 99 రోజుల సంబురాలు చేసుకోవడం విడ్డూరం. రైతుల తాము పండించిన పంటను కలాల్లో పెట్టుకొని రోజులు తరబడి ఎదురుచూస్తున్నా అధికారులు రావడం లేదు. పంటల కొనుగోలు లేకపోవడంతో రైతులు ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతుండటం బాధాకరం.
మరోవైపు ఈదురు గాలుల వల్ల మామిడి రైతులు నష్టపోతున్నారు. వారికి భరోసా కల్పించి ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. భవిష్యత్తు ప్రణాళికలు లేక యూరియా కష్టాలు వంటివి ఎన్నో చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రకంగా రైతులు అసంతృప్తిగా ఉన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ వంటి హామీలను అమలు చేయాలి. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నాం.
మిద్దె సురేష్, నాగర్‌కర్నూల్ జిల్లా






