డ్రైవర్లే ప్రాణదాతలు: ఐజీ కే.రమేష్ నాయుడు
మహబూబాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): వాహన డ్రైవర్లే ప్రాణదాతలని, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం తగదని, రోడ్డు భద్రత చర్యలను పాటించడం వల్ల క్షేమంగా గమ్యం చేరవచ్చని రోడ్డు భద్రత, రైల్వే ప్రొటెక్షన్ విభాగం ఐజీ కే.రమేష్ నాయుడు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం సందర్భంగా, అరైవ్ అలైవ్ లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్లో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వెయ్యి మంది ఇతర వాహన డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాద నివారణ చర్యలతో ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రం రోడ్డు ప్రమాదాల విషయంలో దేశంలో 8వ స్థానంలో ఉందని , రోజుకు సుమారు 70 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, దాని ప్రభావాన్ని నెలవారీ, వార్షిక స్థాయిలో వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదని, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరిగా చేయాలని సూచించారు.
అలాగే డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం పూర్తిగా నివారించాలని, అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకూడదని హెచ్చరించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రతి వాహన డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రాణ నష్టం తగ్గుతుందని అన్నారు. తన అనుభవాలను పంచుకుంటూ అన్ని వర్గాల డ్రైవర్లు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఐజీ రమేష్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా అర్హులైన డ్రైవర్లకు కళ్లద్దాలు పంపిణీ చేశారు.






