అమెరికా వేదికపై వేములవాడ ఒగ్గు కథ
మిద్దె వారసులకు ఘన సన్మానం
వేములవాడ, ఆగస్ట్ 21, (విజయ క్రాంతి): వేములవాడకు చెందిన ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు స్వర్గీయ మిద్దె రాములు కళా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనుమడు మిద్దె వినీత్, మిద్దె పర్శ రాములు అమెరికాలోని ఓక్లాండ్ వేదికగా ఒగ్గు కథ ప్రదర్శించారు. సిలికాన్ ఆంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళా వైభవాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు కళాకారులను సన్మానించారు.
అమెరికా వేదికపై వేములవాడ కళాకారులు ఒగ్గు కథను ప్రదర్శించడం తెలంగాణకే గర్వకారణమన్నారు. మిద్దె రాములు కళా వారసత్వాన్ని కుటుంబ సభ్యులు కొనసాగిస్తూ జానపద కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






