22 August, 2026 | 1:54 AM

ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

22-08-2026 12:25 AM

కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు ట్రస్మా వినతిపత్రం అందజేత

కరీంనగర్ క్రైం, ఆగస్టు 21 (విజయ క్రాంతి): నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకున్న ప్రధానోపాధ్యాయురాలి దారుణ హత్య ఘటనను ట్రస్మా జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా, యావత్ గురుపరంపరపైనే జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ కలిసిన ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయులపై దాడులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయన్నారు. క్రమశిక్షణలో భాగంగా గురువు మందలిస్తేనే తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి గొడవకు దిగుతున్నారని, దీనికి తోడు పాఠశాలల పరిసరాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల బెడద కూడా విద్యార్థుల భవిష్యత్తుకు పెనుముప్పుగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ’ఉపాధ్యాయ రక్షణ చట్టం’ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరం సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు పచ్చునూరి సురేందర్, నగర అధ్యక్షులు రాహుల్ నరేష్, నగర కార్యదర్శి బొమ్మ శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి బండ శ్రీకాంత్, సభ్యులు రాజయ్య, బుచ్చి రెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రమోహన్, గిరిబాబు, మల్లారెడ్డి, కృష్ణవేణి స్కూల్, ఆర్ సి రెడ్డి, రాజయ్య, వెంకన్న, ప్రసాద్, సుశాంత్, ఎలిశమ్మ, మరియమ్మ, అంజయ్య, స్వామి, తదితరులు పాల్గొన్నారు.