09-09-2025 01:21:14 AM
ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థుల్లో విజయమెవరిదో?
ఎన్డీయే అభ్యర్థికే గెలుపు అవకాశాలు!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితంలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం ముందే నిర్ణయమైనా ఏమైనా అనుకోని ఘటనలు జరిగితే ఇండియా అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని విజయం వరించే అవకాశం ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు. మంగళవారం జరగనున్న ఈ ఎన్నికలో పార్లమెంట్‌లోని ఉభయసభల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అభ్యర్థుల వారీగా బలాబలాలను గమనిస్తే ఎన్డీయేకు 422 మంది ఎంపీలున్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆ పార్టీకి మొత్తం 11 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి విషయానికి వస్తే ఆ కూటమికి ఉభయసభల్లో కలిపి 313 మంది ఎంపీలున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. ఆ పార్టీకి ఉభయసభల్లో 12 మంది ఎంపీలున్నారు. ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతిమలివాల్ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఎన్డీయే అభ్యర్థి సులువుగా విజయం సాధించేలా సమీకరణాలు ఉన్నా క్రాస్ ఓటింగ్ ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎటువంటి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎన్డీయే, ఇండియా కూటములు తమ ఎంపీలకు మాక్ పోలింగ్ సెషన్ నిర్వహించాయి. ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్నిక జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించేందుకు 389 మంది ఎంపీల బలం అవసరం అని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలై చెల్లిన ఓట్లలో సగం కంటే 1 ఓటు ఎక్కువగా రావాలి.
ఎన్నిక విధానమిదే..
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. ఎన్నిక మొత్తం బ్యాలెట్ పద్ధతిలోనే జరగనుంది. పార్లమెంట్ వేదికగా ఉభయ సభల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓట్లు వేసే ఎంపీలకు ప్రథమ ప్రాధాన్యత ఓటు, ద్వితీయ ప్రాధాన్యత ఓటు ఉంటుంది. మొత్తం పోలైన చెల్లుబాటు అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ ప్రథమ ప్రాధాన్యత ఓట్లు గెలుచుకున్న అభ్యర్థిని విజయం వరిస్తుంది.
ఒక వేళ పోటీలో ఇద్దరి కంటే ఎక్కువ అభ్యర్థులు ఉండి.. ఎవరికీ సగం కంటే ఎక్కువ ప్రథమ ప్రాధాన్యత ఓట్లు రాకపోతే తక్కువ సంఖ్యలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లు గెల్చుకున్న అభ్యర్థిని ఎలిమినేట్ చేసి అతడికి పోలయిన ఓట్లను ప్రాధాన్యతల ఆధారంగా బదిలీ చేస్తారు. చివరగా ఒక్క అభ్యర్థే విజయం సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగతుంది.
మాక్ పోలింగ్ నిర్వహణ..
ఎన్డీయే, ఇండియా కూటములు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియో గించుకోబోయే ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించాయి. ఎన్డీయే కూటమి, ఇండి యా కూటమి తమ ఎంపీలకు పోలింగ్ విధానాన్ని వివరించాయి. ఎన్డీయే కూటమికి 433 మంది ఎంపీల బలం, ఇండియా కూటమికి 313 మంది ఎంపీల బలం ఉంది.
బీఆర్‌ఎస్, బీజేడీలు దూరం..
ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీలు దూరంగా ఉండనున్నాయి. బీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో నలుగురు ఎంపీలున్నారు. లోక్‌సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేదు. బీజేడీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకున్నా.. రాజ్యసభలో ఏడుగురు ఎంపీల బలం ఉంది.
నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ 2012లో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంది. రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఈ రెండు పార్టీలకు కలిసి 11 మంది ఎంపీలున్నారు. 2022 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్‌ఖడ్‌కు 75 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఎవరిబలమెంత!
సీపీ రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి
433 (వైసీపీ మద్దతు ఇస్తే) 325 (ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిస్తే)