09-09-2025 01:18:22 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఒకవైపు నాలాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ప్రక టిస్తుండగానే, మరోవైపు ఈ ఆక్రమణలు నిరాటంకంగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో, ముఖ్యంగా మణికొండ పరిసరాల్లో భూమి విలువలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో చారిత్రక బుల్కాపూర్ నాలా భూములు అక్రమార్కుల చేతు ల్లో కనుమరుగవుతున్నాయి.
రికార్డుల్లో స్పష్టంగా నాలా గా నమోదై ఉన్న ప్రభుత్వ భూములను, అధికార పార్టీ నాయకుల అండదండలతో, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ వెంచర్లుగా మార్చేస్తున్నారు. నిస్సిగ్గుగా సాగుతున్న ఈ భూకుంభకోణంపై హైడ్రా, నీటిపా రుదల శాఖ కళ్లు మూసుకోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.
సాగు, తాగునీటి అవసరాలను తీర్చిన నాలా
శంకరపల్లి మండలం నుంచి ప్రారంభమై మూసీ నది వరకు విస్తరించి ఉన్న బుల్కాపూర్ నాలా ఒకప్పుడు రాజేంద్రనగర్, ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ వంటి అనేక గ్రామాల గుండా ప్రవహించి, సాగు, తాగునీటి అవసరాలను తీర్చింది. నాలా నీటితో దిగువన ఉన్న చెరువులు, కుంటలు ఎప్పుడూ నిండుగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.
రియల్ ఎస్టేట్ లాబీ, అధికార పార్టీకి చెందిన పలుకుబడి ఉన్న నాయకులు, అవినీతికి అలవాటుపడిన అధికారులు కలసికట్టుగా ఈ నాలాను కబ్జా చేసేందుకు రంగంలోకి దిగారు. మట్టితో పూడ్చివేసి, చదును చేసి, ప్లాట్లుగా మార్చి భారీ భవనాలు నిర్మిస్తున్నారు. కళ్లముందే నాలా ఆనవాళ్లు లేకుండా పోతున్నా, సంబంధిత శాఖలు చోద్యం చూస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోకాపేట చెరువు కబ్జా
కోకాపేట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని పూర్తిస్థాయిలో కబ్జా చేసి ప్రహరీ నిర్మించి, ప్లాట్లుగా ఏర్పాటు చేసేందుకు చదును చేసి విల్లాలను నిర్మించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ భూముల్లోకి వెళ్లేందుకు సరైన రహదారులు లేకపోవడంతో, పక్కనే ఉన్న సెజ్ భూముల్లోంచి అక్రమంగా దారులను ఏర్పాటు చేసి, వాటినే లేఅవుట్లలో చూపి ప్లాటింగ్ చేశారని ఆరోపణలున్నాయి. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 267, 258ల్లోనూ నాలా పూడ్చి ప్రహరీ నిర్మించారు.
ఔటర్ రింగురోడ్డుకు అత్యంత సమీపంలో ఉండటంతో, ఇక్కడ ఎకరం భూమి ధర రూ.60 కోట్ల వరకు పలుకుతోంది. ఈ భారీ విలువైన భూమిని కొందరు బడాబాబులు కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాలాకు ఇరువైపులా 30 మీటర్లు బఫర్‌జోన్‌గా నిబంధనలుండగా, ఎల్‌ఆర్‌ఎస్ పథకం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనలను ఏకంగా వంద మీటర్లకు పెంచింది.
కానీ, ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఈ ఆక్రమణలకు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, రియల్టర్లు పట్టించుకోవడం లేదని, రెవెన్యూ అధికారులకు రూ.కోట్లు కమీషన్లు ముట్టాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
చర్యలు తీసుకోని హైడ్రా!
ఇప్పటికే హైడ్రా అధికారులు బుల్కాపూర్ నాలాను పరిశీలించినా, ఆక్రమణలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నాలాపై అనేకచోట్ల భారీ భవంతులు నిర్మించారు. ఇప్పటికీ కొన్నిచోట్ల పనులు జరుగుతున్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మణికొండలో ఆక్రమణ ఇలా...
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుష్పాలగూడ సర్వే నంబర్ 314, 416, 417, 428 లలో బుల్కాపూర్ నాలా విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో నాలాను పూర్తిగా పూడ్చివేసి, సూఖీ, రాఘవా వ్యూ, హైవా, అపర్ణ జన్యున్, టీమ్4, అమ్రత, ఈన్ని పేరిట రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మణికొండలోని మర్రిచెట్టు కూడలి వద్ద, నాలాకు కనీసం పది అడుగుల దూరం కూడా లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.
దీనిపై ప్రశ్నిస్తే హెచ్‌ఎండీఏ అనుమతులు న్నాయంటూ కబ్జాదారులు దబాయిస్తున్నారని స్థానికులు చెపుతున్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట గ్రామ సమీపంలో ప్రవహించే నాలాను సైతం కబ్జాదారులు పూర్తిగా కనుమరుగు చేశారు. ఖానాపూర్ గ్రామం మీదుగా వచ్చే నాలాను కోకాపేట సెజ్ భూములను ఆనుకుని, సర్వే నంబర్ 84, 85 పక్క నుంచి వెళ్లే దాదాపు ఎకరం విస్తీర్ణం గల ప్రాంతాన్ని మట్టితో పూడ్చి రహదారులుగా మార్చేశారు.