సాదాబైనామా ఉండగానే మరొకరికి రిజిస్ట్రేషన్
తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన
కేసు నమోదు చేసిన పోలీసులు
భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్న గుడిపేట గ్రామంలో ఒకే భూమిని ఇద్దరికీ విక్రయించిన వ్యక్తి పై బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... చిన్న గుడిపేట గ్రామానికి చెందిన రెడ్డి స్వామి 2013లో అదే గ్రామానికి చెందిన 107 సర్వే నంబర్ లో రెండు ఎకరాల భూమిని ఎటకారి రామయ్య వద్ద సాదా బైనామా పై కొనుగోలు చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన భూమిని సాగు చేసుకుంటూ కాస్తు లో ఉండగానే, ఎటకారి రామయ్య ఇదే భూమిని మేకల అంజన్న, పూరెల్ల సాయి అనే వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశాడు.
సాదా బైనామాపై(Sada Bainama Registration) కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు మంగళ వారం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకునే ప్రయత్నంలో ఈ భూమి ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని తహసిల్దార్ తెలపడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన తహసిల్దార్ వెంటనే ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో ఎస్సై పి కోటేష్ సిబ్బందితో వచ్చి వివరాలు తెలుసుకొని గొడవను చల్లపరచారు. రెడ్డి స్వామి ఫిర్యాదు ఈమేరకు ఎటకారి రామయ్య పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమిని ఎస్సై తెలిపారు.
తహసిల్దార్ బికరణ దాస్ వివరణ
సాదాబై నామ ఉండగా రిజిస్ట్రేషన్ చేసిన విషయంపై తహసిల్దార్ బికర్ణ దాస్ ను వివరణ కోరగా 2013లో ఎటకారి రామయ్య సాదా బాయినామాపై 107 సర్వే నంబర్ లోని రెండు ఎకరాల భూమిని రెడ్డి స్వామికి విక్రయించినట్లు మాకు సమాచారం లేదని, ఇదే భూమిని 20 రోజుల క్రితం ఎటకారి రామయ్య మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఇరువురు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ కోసం రాగా ఈ భూమిపై ఎలాంటి వివాదాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. సాదా బైనమా ఉన్నట్లు కనీసం కొనుగోలుదారుడు కార్యాలయంలో ఎప్పుడు దరఖాస్తు చేసుకోలేదని దరఖాస్తు చేసుకుని ఉంటే రిజిస్ట్రేషన్ ఆపే అవకాశం ఉండేదన్నారు. మాకు సమాచారం లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు.






