కత్తిపట్టి.. కదనరంగంలోకి..

10-05-2024 12:05:00 AM

ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ చేసిన సినిమాల్లో చాలా వరకు ప్రేమకథలే. పాత్రల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ కథలు దాదాపుగా అదే అంశం చుట్టూ తిరిగాయి. ఈ చిత్రాలతో యువతకు బాగా చేరువైన విజయ్, ఇప్పుడు రూటు మార్చి యాక్షన్ కథలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్న చిత్రంలో సీరియస్ రోల్ చేస్తున్న విజయ్, ఇటీవల ప్రకటించిన రెండు చిత్రాల్లోనూ మునుపెన్నడూ లేని విధంగా పూర్తి యాక్షన్ అవతార్‌లో కనపడనున్నారు. రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోల దర్శకులుగా విజయ్ తర్వాతి సినిమాలు రానున్న సంగతి తెలిసిందే. గురువారం విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాల యొక్క ప్రీ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేశాయి చిత్ర నిర్మాణ వర్గాలు. రవి కిరణ్ కోల దర్శకుడిగా రూపొందనున్న చిత్రం నుండి వచ్చిన పోస్టర్‌లో నెత్తురు కారుతున్న చేతిలో కత్తి పట్టుకున్నట్టు వుంది. “ఆ చేతిలోని నెత్తురు వారి మరణానిది కాదు, అతడి పునర్జన్మది” అని తెలిపారు దర్శక నిర్మాతలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 59వ చిత్రంగా రూపొం దనున్న ఈ సినిమా రాయలసీమలోని గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనుంది.

అటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్న సినిమాలోనూ ఒక ‘శపించబడిన నేలకు చెందిన యోధుడు’ అంటూ బీటలు వారిన భూమి లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహంతో మరో ఆసక్తికరమైన పోస్టర్ విడుదలైంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో 1854 మధ్య కాలంలో కథ సాగనుండగా “పురాణాలు రాయబడలేదు.. అవి వీరుల రక్తంతో అచ్చువేయబడ్డాయి” అని చెబుతూ ట్వీట్ చేశారు. రెండిటిలోనూ నెత్తుటి ప్రస్తావన వుండటం గమనార్హం. మాస్‌కి చేరువయ్యే క్రమంలో విజయ్ కత్తి పట్టి కదనరంగంలోకి అడుగుపెడుతున్నాడన్నది అసలు విషయం. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ కలయికలో రానున్న ఈ చిత్రం ద్వారా ‘టాక్సీవాలా’ చిత్రం తర్వాత మరోమారు విజయ్‌తో కలిసి పనిచేయనున్నారు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్.