05-01-2026 02:02:31 AM
పల్లె తల్లు
దీనంగా వేడుకుంటోంది
నగరాలను బలువనీయొద్దని
అవి నిలబడ్డది తన పాదాలపై నేనని !
బలిసిన నగరాలన్నీ
గ్రామాలను మింగే కొండచిలువలే
పల్లె అస్తిత్వం కోల్పోతే
ప్రగతి రథం కుంగిపోతది!
చివరకు నిత్య జన జీవన యుద్ధానికి
మిగిలేది పరాజయమే
పసిడి పంటలు పండే
పంట పొలాలన్నీ ప్లాట్లై పరిఢవిల్లితే
తిండి గింజలకు అంగలర్చాల్సిందే!
కాలుష్య కర్మాగారాలు మొలిస్తే
సిటీలో వినిపించేవి
యముని మహిషపు లోహ గంటలే!
పల్లె పచ్చగుంటేనే
నగరాలకు వన్నె చిన్నెలు
జనాభా వికేంద్రీకరణ కానిదే
వికాస భారతానికి సూర్యోదయం ఉండదు
విజ్ఞత కోల్పోయామా
ఇక మనిషిది భస్మాసుర చరిత్రనే!!