calender_icon.png 11 January, 2026 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిసరఫరా పైప్ లైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

11-01-2026 03:17:37 PM

హైదరాబాద్: రామగండం నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పర్యటించారు. ఆదివారం నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో రూ.80 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించి, రూ.88 కోట్లతో నీటిసరఫరా పైప్ లైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదల అవసరాలు తీరలేదని, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు బీఆర్ఎస్ పాలనలో నెరవేరలేదన్నారు.

పాదయాత్ర చేస్తున్నప్పుడు నియోజకవర్గాల్లో ప్రజల అవసరాలు తెలుసుకున్నామని, ముఖ్యంగా పేదలకు ఇళ్లు అందలేదని తెలుసుకుని ఇళ్ల కార్యక్రమాన్ని చెపట్టామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేలా ఆలోచన చేస్తున్నామని, పాలకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి నీరు ఇస్తామని మాట ఇచ్చాం.. దాని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.

ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడితేనే నాయుకుడు, ప్రభుత్వానికి సార్థకత ఉంటుందని, రామగుండం ప్రాంతంలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తామని భట్టి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్ని ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినవే అన్నారు. సింగరేణిపై దాదాపు 80 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, సింగరేణి సంస్థను బొగ్గు తవ్వకానికి పరిమితం చేయకుండా వివిధ మైనింగ్ లకు విస్తరిస్తున్నామని ఆయన వివరించారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లో కూడా సింగరేణి పాల్గొనేలా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు.