22 April, 2026 | 7:43 PM

పాత బావి మూసివేతపై గ్రామస్తుల ఆందోళన

22-04-2026 06:18 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో నూరేళ్ల చరిత్ర కలిగిన మంచినీళ్ల బావిని గ్రామానికి చెందిన మెడికల్ జైరాం మూసివేస్తున్న ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ పంచాయతీ నుండి ఆ పనులను ఆపాలని సూచించినప్పటికీ, పట్టించుకోకుండా బావిని మూసివేసి ఆ భూమిని కబ్జా చేయ్యలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు సర్పంచ్‌తో కలిసి అక్కడికి చేరుకుని జరుగుతున్న పనులను అడ్డుకున్నారు.

బావి గ్రామానికి ఎంతో ఉపయోగకరమైందని, దానిని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్,  పంచాయతీ కార్యదర్శి నవీన్ ఈ ఘటనపై గ్రామ పంచాయతీ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా ప్రభుత్వ లేదా గ్రామానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా, సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.