02-12-2025 07:19:42 PM
కామారెడ్డి జిల్లా ముంబాజిపేట తండాలో తండవాసుల నిర్ణయం
సర్పంచ్, ఉప సర్పంచ్ సన్మానించిన తండ ప్రజలు
కామారెడ్డి,(విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికలలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తమ గ్రామాల్లో అభివృద్ధి చెందాలని కొందరు భావిస్తుండగా పోటీలో ఉన్న వారి తడాఖా తీయాలని మరికొందరు ఉన్నారు. జనరల్ గా రిజర్వ్ అయిన గ్రామాల్లో పోటీ తీవ్రంగా ఉంది. తండాలు చిన్నచిన్న గ్రామపంచాయతీలో మాత్రం గ్రామస్తులు పెద్దలు కూర్చుని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఆలోచనకు వచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని లింగంపేట మండలం ముంబాజిపేట తండాలో గ్రామపంచాయతీ సర్పంచ్ గా మాంజా ఆనస్ రావు, ఉప సర్పంచ్ గా భానోత్ పరశురామును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించారు.
సర్పంచ్ ఉప సర్పంచులతోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం పది లక్షల ఆర్థిక సాయం వస్తుందని దీంతో గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన తండావాసులు ఏకగ్రీవానికి మొగ్గు చూపారు. గ్రామస్తులందరూ కలిసి ముంబాజిపేట తండా సర్పంచిగా మాంజా ఆనస్ రావు, ఉప సర్పంచ్ గా భానోత్ పరుశురాము లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీ లేకుండా అందరి గ్రామస్తుల తీర్మానం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచ్ అభ్యర్థి మాంజా ఆనాస్ రావు, ఉప సర్పంచ్ బానోతు పరుశురాం గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులందరితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.