calender_icon.png 2 December, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే సమాచారం ఇవ్వండి

02-12-2025 07:18:14 PM

* ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి..

* గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు..

* మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు..

పాపన్నపేట (విజయక్రాంతి): ఈ నెల 11న జరుగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని అనంతుని కొత్తపల్లిలోని అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టేక్మాల్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తాండ, సీఎం తాండ, ఎల్లుపేట, ఎల్పుగొండ గ్రామాలకు చెందిన ప్రజలకు పాపన్నపేటలోని కొత్తపల్లి, అబ్లపూర్, అన్నారం గ్రామాలకు చెందిన ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఎన్నికల్లో ఎవరైనా ఎన్నిక ప్రక్రియ కోడ్ ను ఉల్లంఘించిన, అధికారుల విధులకు ఆటంకాలు కలిగించిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండోవర్ చేయడం జరిగిందని, వారి‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అభ్యర్థులు మద్యం, డబ్బులు, ప్రోత్చకాలతో ఓటర్లను మభ్యపెడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదు కావడం మూలంగా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ప్రజలు ఇరు పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ జార్జ్, ఎస్బి సీఐ సందీప్ రెడ్డి, సిసిఎస్ సీఐ రాజశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు ఉన్నారు.