చేతివృత్తులకు ఆర్థిక చేయుతనిచ్చేందుకే విశ్వకర్మ యోజన
నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్, మార్చి 13 (విజయ క్రాంతి): సాంప్రదాయ చేతివృత్తులకు ప్రోత్సాహం అందించి... ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట లో శుక్రవారం విశ్వకర్మ యోజన పథకం కింద పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
15 రోజులపాటు ఈ పథకంలో శిక్షణ పొందిన వారికి 56 కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ....సబ్ కా సాత్...సబ్ కా వికాస్ అనే నినాదం తో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సుకొసం బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టి... కోట్ల మంది ప్రజలకు లబ్ధిచేకూరుస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన పథకాలు కిందిస్థాయి ప్రజల వరకు చేరడం సంతోషకరం అన్నారు.
ఇందులో భాగంగా విశ్వకర్మ యోజన పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం లో కొత్తపల్లి మండల కేంద్రంలోనే దాదాపు 260 మంది లబ్ధిపొందడం చాలా గొప్ప విషయం అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఈనెల 14న జరిగే అంజన్న ఆశీర్వాద పాదయాత్ర కు ప్రజలు, పార్టీ శ్రేణులు, అంజన్న భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అనిల్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.




