18 July, 2026 | 9:07 PM

గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి

18-07-2026 08:36 PM

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,(విజయక్రాంతి): వచ్చేవారం నుంచి గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ఎల్ నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా  అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎల్ నినో పరిస్థితులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం  కరీంనగర్ లో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, భూగర్భజల శాఖ అధికారులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మితో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో సాగు చేసే పంటల వివరాలు, నేల స్వభావం, భూగర్భ జలాలు, వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, రైతుల వివరాలు పూర్తి నివేదికలతో సమావేశానికి రావాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఇప్పటివరకు ఎంతమంది ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపారో వివరాలు నమోదు చేయాలన్నారు.  జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను వివరించి, కూరగాయలు, పండ్ల మొక్కల సాగు పెంచాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, నీటిపారుదల శాఖ, పంచాయతీ,  విద్యుత్, రెవిన్యూ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని రైతులకు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.