calender_icon.png 11 February, 2026 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలి

11-02-2026 12:49:05 AM

  1. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య 
  2. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు 

నిజామాబాద్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి) : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలు పంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.

సమీకృత జిల్లా కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్ల ను వెల్లడించారు.  నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి 3,48,116 మంది ఓటర్లు ఉండగా, 488 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.

అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డుల పరిధిలో 69,439 మంది ఓటర్లు ఉండగా 111 పోలింగ్ కేంద్రాలను, ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో 36 వార్డులలో 63,977 ఓటర్లకు గాను 106 పోలింగ్ కేంద్రాలను, భీంగల్ మున్సిపాలిటి పరిధిలో 12 వార్డులలో 14,046 మంది ఓటర్లు ఉండగా, 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 

నిజామాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ,బోధన్, విజయ మేరీ హైస్కూల్ లో, ఆర్మూర్, ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించి భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు.  పోలింగ్ అనంతరం వీటిలోనే భద్రపరుస్తామన్నారు.  ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపడతామనీ తెలిపారు.

నాలుగు మున్సిపాలిటీలలో కలుపుకుని మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, బోధన్ లో 162 మంది, ఆర్మూర్ లో 153 మంది, భీంగల్ లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు. ఈ నెల 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించి, పోలైన ఓట్లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించామన్నారు.

ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజున ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని, 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని నిజామాబాద్ నగర పాలక సంస్థలో జరిగే సమావేశానికి నిజామాబాద్ ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ గా, బోధన్, ఆర్మూర్ లలో సబ్ కలెక్టర్లు, భీంగల్ లో జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. 

సి పి సాయి చైతన్య మాట్లాడుతూ  ఏడుగురు ఏ.సీ.పీలు, 70 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మరో 70 మంది సబ్ ఇన్స్పెక్టర్లు సహా 1370 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని, ప్రత్యేకంగా మూడు ప్లాటూన్ల పోలీసు బలగాలు జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు.    సోషల్ మీడియా పై గట్టిగా పెట్టమన్నారు.  ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే పాత నేరస్తులను బైండోవర్ చేశామని, 67 లైసెన్సుడు తుపాకులను డిపాజిట్ చేశారని తెలిపారు.  ఈ విలేకరుల సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.