7 August, 2026 | 1:33 AM

ఫుట్‌పాత్‌లు మాయం.. రోడ్లపైకి పాదచారులు!

07-08-2026 12:33 AM

వరంగల్ మహానగరంలో నడక కష్టాలు..

ప్రమాదాల ముప్పులో పట్టణ ప్రజలు

వరంగల్ (మహబూబాబాద్), ఆగస్టు 6 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్‌లు ఆక్రమణలకు గురవుతుండటంతో ప్రజలు రోడ్లపైనే నడవాల్సిన దుస్థితి నెలకొంది. చిరు వ్యాపారాలు, దుకాణాల విస్తరణ, తోపుడు బండ్లు, పార్కింగ్ తదితర కారణాలతో ఫుట్పాత్లు కనుమరుగవుతున్నాయి. దీంతో వాహనాల మధ్య నుంచి రోడ్లపై పాదచారులు ప్రయాణించాల్సి రావడం ప్రమాదాలకు దారితీస్తోంది.

నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఫుట్పాత్ ఉన్నా..వాటి పైన నడిచే పరిస్థితి లేదు. వరంగల్ మహానగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాల్లో పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్లను అనేక చోట్ల వ్యాపారులు తమ దుకాణాల ముందు అదనపు స్థలంగా వినియోగిస్తున్నారు. కొందరు వ్యాపారులు సామగ్రిని ఫుట్పాత్లపై ఉంచుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తోపుడు బండ్లు, తాత్కాలిక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా ఫుట్పాత్లు ఉన్నప్పటికీ పాదచారులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.

*రోడ్లపై నడక.. ప్రాణాలతో చెలగాటం

ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురికావడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వేగంగా వెళ్లే ప్రధాన రహదారులపై పాదచారులు నడవాల్సి వస్తుండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.

ఇక వికలాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయం మారింది. ఫుట్పాత్లపై అడ్డంకులు ఉండటం వల్ల దివ్యాంగులు, వృద్ధులు రోడ్లపైకి రావాల్సి వస్తోంది. వీల్చైర్లు, వాకర్లతో వెళ్లేవారికి ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉన్నాయి. పాదచారుల భద్రత కోసం నిర్మించిన ఫుట్పాత్లు ప్రయోజనం లేకుండా పోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*పార్కింగ్ సమస్యతో మరింత ఇక్కట్లు

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఫుట్పాత్లను వాహనాల పార్కింగ్ కోసం వినియో గిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు ఫుట్పాత్లను ఆక్రమించడంతో పాదచారులకు మిగిలేది రోడ్డే. దీంతో ఒకవైపు ట్రాఫిక్ రద్దీ, మరోవైపు పాదచారుల రాకపోకలతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

*అధికారుల పర్యవేక్షణ ఏదీ?

ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా మారడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఒకసారి ఆక్రమణలు తొలగించినా కొద్ది రోజులకే తిరిగి అదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు చెబుతున్నారు.  ఫుట్‌పాత్‌ను పూర్తిస్థాయిలో సర్వే చేసి వాటి హద్దులను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణలను తొలగించడంతో పాటు మళ్లీ ఆక్రమణలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచిస్తున్నారు.

ఫుట్పాత్లపై అనధికార పార్కింగ్, దుకాణాల విస్తరణ, తాత్కాలిక వ్యాపారాలను నియంత్రించి పాదచారులకు సురక్షితమైన నడక మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.  పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్లు.. పాదచారులకే అందుబాటులో లేకపోతే వాటి నిర్మాణం ఉద్దేశ మేంటి? అన్న ప్రశ్న ఇప్పుడు వరంగల్ మహానగర పాలన ప్రజల్లో వినిపిస్తోంది. అధికారులు కేవలం అప్పుడప్పుడు ఆక్రమణల తొలగింపునకు పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.