సామంతులు వద్దు
తెలంగాణ మళ్లీ ఢిల్లీకి కప్పం కట్టే పరిస్థితి వచ్చింది
- యాచించి కాదు.. శాసించే తెలంగాణే కావాలని జయశంకర్ సార్ బోధన
- తెలంగాణను మళ్లీ కేసీఆర్ చేతిలో పెట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : ‘యాచించి కాదు.. శాసించే నాయకత్వమే తెలంగాణకు అవసరం’ అని ప్రొఫెసర్ జయశంకర్ సార్ బోధించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. జయశంకర్ సార్ తెలంగాణకు దిక్సూచి అని, ఆయన ఆశయాలే బీఆర్‌ఎస్‌కు మార్గదర్శకమన్నారు. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పని చేస్తుందని చెప్పారు.
తెలంగాణను మళ్లీ కేసీఆర్ చేతుల్లోపెట్టి, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లడమే జయశంకర్ సార్‌కు అందించే నిజమైన నివాళి అని చెప్పారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందు తాకట్టు పెట్టే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని, దాదాపు ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ‘ఢిల్లీకి సామంతులు కాకుండా స్వతంత్రులు కావాలి‘ అని జయశంకర్ సార్ చెప్పేవారని గుర్తు చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆయన ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేశారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, జీఆర్‌ఎంబీ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఆధారాలతో వివరించారని చెప్పారు. ఢిల్లీకి సామంతుల్లా మారొద్దు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని సూచించారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని, తెలంగాణ కోసం పుట్టిన నిఖార్సయిన పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌లో పోల్చినా, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, అప్పులు, అభివృద్ధి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మిగులు రాష్ట్రమని బీపీఆర్ విఠల్ అధ్యయనాలు నిరూపించాయని, నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం వాటిని వినియోగించలేకపోతోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు శాశ్వత శత్రువని జయశంకర్ సార్ చెప్పేవారని గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
తెలంగాణకు దిక్సూచి..
జయశంకర్ సార్‌తో పదేళ్ల పాటు కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని కేటీఆర్ తెలిపారు. ఆయన ఒక ఎన్ సైక్లోపీడియా, గొప్ప ఉపాధ్యాయుడని కొనియాడారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా భావించిన జయశంకర్ సార్, ఆయనకు గాడ్ ఫాదర్‌లా మార్గనిర్దేశనం చేశారని చెప్పారు. స్వయంసమృద్ధి, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే మూడు దశల ద్వారా తెలంగాణ సమాజాన్ని జయశంకర్ సార్ విశ్లేషించారని, పాలమూరు వెనుకబాటుతనాన్ని కూడా అదే కోణంలో వివరించారని అన్నారు.
2006, 2008 ఉప ఎన్నికల సమయంలో ఉద్యమానికి భావజాల వ్యాప్తి, ఆందోళన, డెమోక్రటైజేషన్ అనే మూడు పార్శ్వాలు ఉన్నాయని జయశంకర్ సార్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ అరెస్టు, హన్మకొండలో ధర్నా, జయశంకర్ సార్ ఇంటికి వెళ్లిన ఘటనలు తన జీవితంలో భావోద్వేగ క్షణాలని చెప్పారు. ‘ఉద్యమం భాస్వరంలా మండుతుంది.. తెలంగాణ తప్పక వస్తుంది’ అని జయశంకర్ సార్ తమకు ధైర్యం చెప్పారని, శ్రీకాంతాచారి వంటి అమరవీరుల త్యాగాలతో ఉద్యమం విజయవంతమైందన్నారు.
ఢిల్లీలో జాతీయ మీడియాకు తెలంగాణ చరిత్రను, హైదరాబాద్ రాష్ట్ర ప్రత్యేకతను, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను, ఆంధ్ర విలీనానికి గల కారణాలను జయశంకర్ సార్ ఆధారాలతో వివరించేవారని తెలిపారు. ‘మేము కొత్త రాష్ట్రం కోసం పోరాడటం లేదు.. రాష్ట్రాన్ని పునరుద్ధరించడానికి పోరాడుతున్నాం’ అనే ఆయన మాటలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని జయశంకర్ సార్ బలంగా నమ్మేవారని, తెలంగాణ ప్రజలను చిన్నబుచ్చే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.






