7 August, 2026 | 1:35 AM

అధ్వానంగా మారిన రోడ్లు

07-08-2026 12:50 AM
  1. పొంగుతున్న డ్రైనేజీలు 
  2. నరకం అనుభవిస్తున్న మేడ్చల్ పట్టణ ప్రజలు 
  3. కనీస మరమ్మతులకు నోచుకోని రోడ్లు 
  4. ప్రముఖులు వెళ్లే కోర్టు రోడ్డుపై భారీ గుంతలు..

మేడ్చల్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది. పేరుకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అయినా పట్టణ పరిస్థితి మారుమూల పల్లెటూరు కంటే అధ్వానంగా తయారయింది. పల్లెటూర్లలో వివిధ పథకాల కింద సిసి రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నారు. మేడ్చల్ పట్టణంలో మాత్రం ఇప్పటివరకు రూపాయి ఖర్చు చేయలేదు.

నిధులు మంజూరు అయ్యాయి, పనులు ప్రారంభిస్తామని అధికారులు, అధికార పార్టీ నాయకులు చెబుతున్నారే గాని పనులు మాత్రం ప్రారంభించడం లేదు. మేడ్చల్ పట్టణ హోదా పెరిగింది కానీ, సౌకర్యాలు మాత్రం పెరగలేదు. గతంలో మేడ్చల్ పట్టణం గ్రామపంచాయతీ గా ఉండేది. ఆ తర్వాత మున్సిపాలిటీకి అప్ గ్రేడ్ అయింది. మున్సిపాలిటీగా ఒక టర్మ్ మాత్రమే ఉంది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా విభజించగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేడ్చల్ చేరింది. హోదా పెరిగిన కొద్దీ సౌకర్యాలు మెరుగుపడాల్సింది పోయి సమస్యలు పెరిగాయి. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ గా ఉన్న సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే అధికారులు వెంటనే స్పందించేవారు. కానీ ప్రస్తుతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పట్టించుకునే వారే లేరు.

అధ్వానంగా మారిన రోడ్లపై కనీసం ప్యాచ్ వర్క్ లో కూడా చేయడం లేదు. గ్రంథాలయం వద్ద ఇటీవల రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. కింది బస్తీ రోడ్డు, కిష్టాపూర్, కేఎల్‌ఆర్ రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. గుంతల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు నడుము నొప్పితో బాధపడుతున్నారు. 

కోర్టు రోడ్డులో భారీ గుంతలు 

జాతీయ రహదారి నుంచి కోర్టు వైపునకు వెళ్లే రోడ్డు పై హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలలో కార్లు, ఆటోలు వెళ్లలేకపోతున్నాయి. కోర్టు ఇదే రోడ్డులో ఉండడం, అటువైపు కాలనీలు ఉండడం వల్ల ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. జడ్జిలు వెళ్లే ఈ రోడ్డుకు అధికారులు కనీసం మరమ్మతులు చేయలేకపోతున్నారు. జాతీయ రహదారుల అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ఈ గుంతలను పూడ్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. 

పొంగుతున్న డ్రైనేజీలు 

పట్టణంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నిత్యం రోడ్లమీద మురుగునీరు ప్రవహిస్తోంది. కొన్ని కాలనీలలో ఇళ్ళ ముందు నుంచి డ్రైనేజీ నీరు ప్రవహించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నడుచుకుంటూ వెళ్లేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి వర్షం కురిసిన పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. వర్షం నీరు, డ్రైనేజీ నీరు రోడ్లమీద ప్రవహిస్తుంది. వర్షం పడితే ప్రజలు రోడ్లమీద నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.