సింగరేణికి ‘నైనీ’ సిరులు
- ఒడిశా నుంచి తొలి బొగ్గు రైలు రాష్ట్రానికి
- 59 వ్యాగన్లలో 4 వేల టన్నుల బొగ్గు రాక
- తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా
- ఫలించిన డిప్యూటీ సీఎం కృషి
- అమెరికా నుంచి సింగరేణి యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన భట్టి
హైదరాబాద్/మంచిర్యాల, ఆగస్టు6 (విజయక్రాంతి): సింగరేణి చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన ఒడిశాలోని ’నైనీ’ బొగ్గు బ్లాక్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఒడిశాలోని నైనీ గని నుంచి తొలి బొగ్గు రేకు రైలు 1,131 కిలోమీటర్ల ప్రయాణం చేసి గురువారం మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (ఎస్టీపీపీ) చేరుకుంది. 59 వ్యాగన్లలో నాలుగు వేల టన్నుల నాణ్యమైన జీ- గ్రేడ్ బొగ్గు సింగరేణికి చేరుకోవడం రాష్ట్ర ఇంధన రంగానికి కొత్త కళను తీసుకొచ్చింది.
ఇతర రాష్ట్రంలోని సింగరేణి నుంచి తెలంగాణకు బొగ్గు సరఫరా కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో ఎస్టీపీపీలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఇంధన భద్రతలో ఇది సువర్ణాధ్యాయంగా నిలిచింది. కేంద్ర బొగ్గు శాఖ 2015లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్‌ను కేటాయించింది. అయితే తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నైనీ బ్లాక్‌ను గాలికొదిలేసింది. దీంతో అనుమతులు రాక ప్రాజెక్టు పడకేసింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నైని బొగ్గు గనిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమతుల సాధనలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అలుపెరగని కృషి చేశారు. స్వయంగా రెండుసార్లు ఒడిశా పర్యటనకు వెళ్లారు.
2024 జూలైలో తొలిసారిగా ఒడిశా వెళ్లి అక్కడి ప్రభుత్వంతో, అధికారులతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో 2025 ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని డిప్యూటీ సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆరుగాలం శ్రమ ఫలితంగా, నేడు నైనీ నుంచి తొలి బొగ్గు రేకు తెలంగాణ గడ్డపైకి చేరుకుంది.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న తొలి నైనీ బొగ్గు రైల్వే రేకుకు సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వీ. సూర్యనారాయణ, డైరెక్టర్(ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో ఇటీవల తాడిచెర్ల- మణుగూరు డిప్ సైడ్ బ్లాకులు సంస్థకు లభించాయన్నారు. త్వరలో మరికొన్ని గనులను కూడా సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నైనీ గని సాధనకు కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వానికి వారు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
చారిత్రాత్మక సందర్భం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నైనీ నుంచి తొలి బొగ్గు రాష్ట్రానికి చేరిన నేపథ్యం లో అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సిం గరేణి యాజమాన్యానికి, కార్మికులకు వీడియో ద్వారా అభినందనలు తెలియజేశారు. సింగరేణికి ఇది ఒక చారిత్రాత్మక సందర్భం, రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి బొగ్గును సరఫరా చేస్తుందన్నారు.
పెరుగుతున్న రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచే ప్రక్రియ కొనసాగుతుందని, ఇప్పటికే ‘తాడిచర్ల- బ్లాక్‌ను పొందామని, ఇటీవల వేలంలో మనుగూరు బ్లాక్‌ను దక్కించుకున్నామని భట్టి వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని బ్లాకులను సాధించేందుకు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. రాబోయే వందేళ్లలో సింగరేణి కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాల్లోకి కూడా అడుగుపెట్టాలని, ప్రపంచంలోనే అత్యుత్తమ మైనింగ్ సంస్థలతో పోటీపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అందుకోసం అత్యాధునిక మైనింగ్ యంత్రాలు ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా, వాటిని తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే క్యాటర్ పిల్లర్ కంపెనీకి చెందిన ఆధునిక మైనింగ్ పరికరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఒడిశా నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రవాణా విజయవంతం కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, భారతీయ రైల్వేలు, సంబంధిత అధికారులు, ఉద్యోగులకు సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






