08-05-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం,/ఖమ్మం, మే 7 (విజయ క్రాంతి): పహల్గాం దాడి తర్వాత దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందని సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకోంటోందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దాన్ని తుద ముట్టించాల్సిందేనని ఆయన తెలిపారు. బుధవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం బెజవాడ రవి అధ్యక్షతన స్థానిక గిరిప్రసాద్ భవన్ లో నిర్వహించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమంతరావు మాట్లాడుతూ మోడీ ఆలోచనలో ఎటువంటి మార్పు లేదని ప్రజల గురించి కాకుండా సంపన్న వర్గాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి పని దినాలు తగ్గించడం, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతుందన్నారు.
దేశంలో నెలకొన్న ఉద్రిక్తతను మత ఉన్మాదులు అవకాశంగా తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతుండడంతో ప్రభుత్వం పట్ల విశ్వసనీయత సన్నగిల్లుతుందన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం లక్ష్యం దిశగా పని చేయలేదన్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవలం 40 శాతం మాత్రమే రుణమాఫీ పూర్తయినట్లు తెలుస్తుందన్నారు. రైతు భరోసా నాలుగు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో వేశామని చెబుతున్నప్పటికీ అది కూడా అమలు కాలేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న జాప్యం రైతుల పాలిట శాపంగా మారిందని తెలిపారు. కోతలు విధించడంతో పాటు కొనుగోళ్లలో లోపాలు ఉన్నాయన్నారు.
రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి -వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమ య్యా యని భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హేమంతరావు తెలిపారు.
రైతు బీమా, పంటల బీమా విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పంటల బీమా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఇతరత్రా కారణాలతో పంటలు నష్టపోవడం జరుగుతుందని బీమా వర్తించక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని తెలిపారు. శత వసంతాల సిపిఐ ముగింపు సభ ఖమ్మంలో జరగనుందని ఈ మహాసభకు 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారన్నారు.
ముగింపు సభకు ముందు మండల, జిల్లా, రాష్ట్ర జాతీయ మహాసభలు జరగనున్నాయని నిర్ణీత తేదీల్లో ఖమ్మంజిల్లాలోని అన్ని మండల మహాసభలను పూర్తి చేయాలని హేమంతరావు స్పష్టం చేశారు. కార్యక్రమాల నివేదికను జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ప్రవేశపెట్టగా మహాసభలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ -మౌలానా పాల్గొన్నారు.