వస్తున్నాం లింగమయ్యా!
- ప్రారంభమైన సలేశ్వరం జాతర
- ఏర్పాట్లలో విఫలమైన అధికారులు
- ఎంట్రీ పేరుతో దోపిడీ
- తాగునీటికి తప్పని తిప్పలు.
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని దట్టమైన అడవి, సెలయేళ్ల నడుమ ఎతైన గుట్ట కింది భాగాన లింగాకారంలో వెలసిన లింగమయ్య దర్శనం కోసం ఏటా చైత్ర పౌర్ణమిన సలేశ్వరం జాతర అశేష జన ప్రవాహం మధ్య కొనసాగుతోంది. అక్కడ నివసించే చెంచులే పూజారులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జాతర ప్రారంభమైంది.
సుమారు మూడు రోజుల పాటు దర్శనమిచ్చే ఈ స్వామి చెంతకు చేరేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర కేరళ వంటి ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వస్తున్నాం లింగమయ్య అంటూ భక్తులు వచ్చి చేరుతుంటారు. సుదూర ప్రాంతాల నుంచి బస్సులు ఇతర వాహనాలు ఆర్టిసి బస్సుల ద్వారా వచ్చి చేరుతున్న భక్తులకు జిల్లా యంత్రాంగం సరైన సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని భక్తులు మండిపడుతున్నారు.
గొంతు తడుపుకోవడం కోసం గుక్కెడు నీరు కూడా దొరికే పరిస్థితి లేదని ఒక్క వాటర్ బాటిల్ 50 రూపాయలకు మించి అమ్ముతున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారికి నైవేద్యంగా అందించే టెంక ధర కూడా అమాంతం పెంచేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకపోయినా ప్రైవేటు వ్యక్తులకు అనుమతించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఎంట్రీ పేరుతో అటవీశాఖ అధికారులు ఫీజులు భారీగా వసూలు చేయడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 దాటిందంటే సరైన విద్యుత్తు కాంతులు ఏర్పాటు చేయకపోవడంతో సెల్ఫోన్ లైట్స్ సహకారంతోనే కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు మాత్రం కంటి తుడుపుగా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిస్తూ మమ అనిపించారు.




