300 కోట్లు పెండింగ్!
‘మన ఊరు-మన బడి’ బిల్లుల చెల్లింపులో జాప్యం
- ప్రతినెలా 50 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం
- కేవలం ఒక్క నెలవి మాత్రమే చెల్లింపు
- దాంట్లోనూ 90 శాతం పెద్ద కాంట్రాక్టర్లకే..
- దయనీయస్థితిలో చిన్న కాంట్రాక్టర్లు
- అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తి
- ఒకేసారి సెటిల్ చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాం లో చేసిన పనులకు సంబంధించి రూ. 300 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ప్రతి నెలా రూ.50 కోట్ల చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. గత ఏప్రిల్ నెలలో మాత్రమే రూ.50 కోట్లు చెల్లించింది. విడుదల చేసిన దాంట్లోనూ రూ. 46 కోట్లు ఓ పెద్ద కంపెనీకే ఇచ్చిందని చిన్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పను లు చేపట్టి మూడేళ్లవుతున్నా బిల్లులు రాకపోవడంతో చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది.
9 వేల పాఠశాలల్లో అభివృద్ది పనులు
బీఆర్‌ఎస్ హయాంలో మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 9 వేల ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు వెయ్యి మంది కాం ట్రాక్టర్లు ఈ పనులు చేశారు. డైనింగ్ హాల్, మ రుగుదొడ్ల నిర్మాణం, కాంపౌండ్ వాల్, ఎలక్ట్రికల్ వంటి మైనర్ పనులను చిన్న కాంట్రాక్టర్లు అప్పగించగా, పేయంటింగ్, స్మార్ట్ క్లాస్‌లకు సంబంధించి డిజిటల్ బోర్డులు ఏర్పాటు తదితర పెద్ద పనులను ఓ బడా కంపెనీకి ఇచ్చారు. వెయ్యి మంది కాంట్రాక్టర్లలో రూ.10 లక్షల లోపు పనులు చేసిన వారు 600 మంది వరకు ఉంటారు.
ఇందులో రూ.5 లక్షల లోపు పనులు చేసిన వాళ్లకు దాదాపు రూ.141 కోట్లు, రూ.5- 10 లక్షల లోపు రావాల్సిన బిల్లులు రూ.75 కోట్లు, రూ.10-30 లక్షల లోపు రూ.75 కోట్లు, రూ.30 లక్షలకు పైగా రావాల్సిన బిల్లులు రూ. 50 కోట్లకుపైగా ఉంటాయి. మొత్తం కలిపి చిన్న కాంట్రాక్టర్లకు రూ.350 కోట్ల వరకు చెల్లించా ల్సి ఉంది. ఇందులో రూ.50 కోట్లు విడుదల చేయగా ఇంకా రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉం ది. బడా కంపెనీలకు రూ.650 కోట్లకు దాదాపు క్లియర్ చేసినట్లుగా ఓ కాంట్రాక్టర్ తెలిపారు.
ఆర్థిక భారంతో చిన్న కాంట్రాక్టర్లు
అప్పులు చేసి మరీ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, బిల్లులు రాకపోవడంతో వడ్డీ భారం పెరుగుతుందని చిన్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రూ.100 కోట్లు చెల్లిస్తే మైనర్ పనులు చేసిన వారి సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. రూ.5 లక్షల లోపు బిల్లులకు కూడా మూడేళ్లుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పెద్ద కాంట్రాక్టర్లకు దాదాపు 99 శాతం బిల్లులు క్లియర్ చేసిన ప్రభుత్వం.. తమకు రేపుమాపు అంటూ కాలయాపన చేస్తుందని అంటున్నారు.
డబ్బుల్లేవు.. ఉన్నప్పుడిస్తాం: ఓ బాధిత కాంట్రాక్టర్
ప్రభుత్వాన్ని బిల్లులు అడిగితే డబ్బుల్లేవు, ఉన్నప్పుడు ఇస్తామని అంటుంది. ఎప్పుడు అడిగినా ఇదే మాట చెబుతుంది. గత ప్రభుత్వంలో కూడా బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఈ ప్రభుత్వంలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి నెలా రూ.50 కోట్ల చొప్పున విడుదల చేస్తానని గత ఏప్రిల్ నెలలో మాత్రమే రూ.50 కోట్లు ఇచ్చింది. ఇందులోనూ 90 శాతం వరకు ఓ బడా కంపెనీకే పోయాయి. ఈనెలలో మరో రూ.50 కోట్లు మంజూరు చేశామంటున్నారు. అవి ఇంకా జమ కాలేదు. అధికారులను అడిగితే నేడోరేపో జమ అవుతాయని అంటున్నారు.






