ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం
- ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
- తాండూరులో రోడ్ల పనులకు శంకుస్థాపన
తాండూరు, జూలై 18 (విజయక్రాంతి): ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టినట్టు వెల్లడించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి, నిర్మాణాల కోసం 900 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ, అదనపు కలెక్టర్‌లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి పాల్గొన్నారు.






