మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం
- మాయ మాటలు చెప్పి మోసం చేస్తామంటే కుదరదు
- బిజెపి మహిళా బిల్లుతో ప్రజలను నమ్మేలా చేస్తుంది
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, ఏఫ్రిల్ 25 (విజయక్రాంతి) : పాలమూరు గడ్డ మీద నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని బృందావన్ క్లాసిక్ గార్డెన్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పూర్వాపరాలు విషయం లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ బిల్లులను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ బిల్లుల వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ వంటి ప్రాంతాలకు నష్టం జరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. 2023లో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ, దాని అమలును 2034కు వాయిదా వేయడం సరైంది కాదని, వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు, డీలిమిటేషన్లో న్యాయం జరిగేలా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోఫెసర్ కోదండరాం, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్,, పాశం యాదగిరి, జాన్ వెస్లీ, శారదాగౌడ్, కిల్లె గోపాల్, రఫీ, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.






