21-01-2026 01:37:26 AM
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీ ఆర్‌కు నోటీసులిచ్చినా భయపడేదిలేదని, ఇలాంటి నోటీసులు వెయ్యి ఇచ్చినా, మరో వంద సిట్స్ వేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు స్వయంగా తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పినా, ఇదే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నోటీసులిచ్చిందని పేర్కొన్నారు.
నిజంగానే సిట్ వేయాల్సి వస్తే మంత్రుల అరాచకాలు, అవినీతి, అక్రమాలపై వేయాలని, మంత్రి పొంగులేటి కొడుకు వందల మందితో వెళ్లి భూకబ్జాకు పాల్పడితే దానిపై సిట్ ఎందుకు వేయలేదని, అమృత్ టెండర్ల స్కాంపై సృజన్‌రెడ్డి అంశంలో సిట్ వేయాలన్నారు. సింగరేణి టెండర్ల కుంభకో ణం లో అసలు సూత్రధారి సీఎం బావమరిది సృజన్ రెడ్డేనని కేటీఆర్ ఆరోపించారు. ఓ మీడియా కథనంపై సిట్ వేసి అరెస్టు చేసినప్పుడు, మరో మీడియా సంస్థ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్కాం చేశాడంటే సిట్ ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు.
కేవలం జర్నలిస్టులను అరెస్టు చేస్తు న్న సీఎం రేవంత్ రెడ్డి, మీడియా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని నిలదీశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సింగరేణిలో ఇంత జరుగుతున్నా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లొట్టపీసు కేసు అని, దీనిని హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టివేసినా సిట్‌తో విచారణ చేయిస్తున్నారని, తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.
రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉన్నదని, అదే విధంగా అందరికీ అది అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. అడ్డగోలు సిట్ విచా రణల పేరుతోనే ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీలు, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారం అందలం ఎక్కిచ్చినా బుద్ధి మాత్రం రేవంత్ రెడ్డి బురదలోనే ఉన్నదన్నారు.
దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నారు, ఒక మంత్రి 20 శాతం, ఒకాయన బ్యాగ్ మ్యాన్, రెండు బ్యాగులు పంపాడేమో, బ్యాగులు బ్యాగులు పంచుకుని పదవులు కాపాడాకునే దండుపాళ్యం బ్యాచ్ అది, వాళ్ల కమీషన్లు, దందాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ విచారణలని సీఎం, మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
గతంలో హరీశ్‌రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. కానీ కేవలం హరీశ్‌రావుపై కుట్రతో జైలుకు పంపించాలన్న దురుద్దేశంతోనే సుప్రీంకోర్టులో ప్రజల డబ్బులు పెట్టి మరీ ప్రభుత్వం వాదించిందన్నారు.
కుంభకోణాన్ని బయటపెట్టినందుకే నోటీసులా?
నిన్న సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే సాయంత్రం హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చారన్నారు. హరీశ్‌రావు బొగ్గు కుంభకోణంలో బయటపెట్టిన సమాచారం తప్పు అయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారి రాష్ట్ర ప్రభు త్వం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నదని తెలిపారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా సింగరేణి టెండర్లను రిగ్గింగ్ చేశారని ఆరోపించారు.
ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను సీఎం కుటుంబం నియంత్రించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి స్వయంగా అందరినీ బెదిరిస్తున్నాడని, సర్టిఫికెట్ కోసం ఎవరైనా బెదిరింపులకు లొంగ కుండా ఉంటే, సైట్ విజిట్ సర్టిఫికెట్ అర్హులైన కంపెనీలకు ఇవ్వడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క రద్దు చేశామని చెప్తున్న నైని కోల్ బ్లాక్స్ వెనుక కూడా ఇదే అక్రమ దంద నడుస్తున్నదన్నారు. ఇతర కంపెనీలను అందరినీ బెదిరిం చి ఎక్కువ అంచనా విలువకు టెండర్లు వేశారని, అందుకే సృజన్ రెడ్డి కంపెనీకి కూడా అధిక విలువకు టెండర్లు దక్కించుకున్నారని తెలిపారు.
ఈ మొత్తం సింగరేణి అంశంలో ప్రధాన ముద్దాయి సృజన్‌రెడ్డి... ఈ సింగరేణి దొంగతనంలో బీజేపీకి వాటాలు లేకుంటే ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలని, కేంద్రం భాగస్వాములుగా ఉన్న సింగరేణికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు కిషన్ రెడ్డి మౌనంగా ఉన్నారు?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇందులో వాటాలు ఉన్నాయి అని అనుకోవాలి అని అన్నారు. వెంటనే ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ వేయాలని డిమాం డ్ చేశారు. నైనీ గనులతో పాటు మిగిలిన 9 కాంట్రాక్టులను రద్దు చేస్తారా లేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారని, అందుకే అటెన్షన్ డైవర్షన్ కోసం నోటీసులు ఇవ్వడం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది
అసెంబ్లీలోనే 8 మంది మంత్రులను ఎదుర్కొన్న హరీశ్‌రావును నలుగురు పోలీస్ అధికారుల ముందు కూర్చోబెడితే ఏమవుతుంది? అని కేటీఆర్ అన్నారు. న్యాయవ్యవ స్థపై తమకు నమ్మకం ఉన్నదన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నం, తెలంగాణ బలం, తెలంగాణ గళం తమ పార్టీ అని, ముఖ్యమంత్రి అనుచరుడు రోహిన్ రెడ్డి తుపాకీతో బెదిరించినప్పుడు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తుపాకీ ఎక్కుపెట్టి ఎనిమిది కోట్ల రూపాయల నగదు డిమాండ్ చేసినప్పుడు సిట్ ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు.
రెండు సంవత్సరాల తర్వాత తమ ప్రభుత్వం వస్తుంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు కచ్చితంగా భవిష్యత్తులో బలి అవుతారని, పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు రెచ్చిపోయే అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపల ఉండేవారు అంటూ ఎక్కువ మాట్లాడుతున్న అధికారులు కూడా గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ జెండా గద్దెలను దమ్ముంటే ముట్టుకోండి మా జెండా గద్దెలను ముట్టుకుంటే మీ గద్దెలు పోతాయని హెచ్చరించారు.
హార్వర్డ్‌కు పోయి ఏంచేస్తాడో...
రేవంత్ రెడ్డి హార్వర్డ్ వెళ్లి ఏం చేస్తాడో అర్థమవుతలేదని, ఇంగ్లిష్ మాట్లాడే వాళ్లని తిడతారేమో అక్కడ...ఇంగ్లిషులో చదువు చెప్పేవాళ్లను కూడా బాత్రూంలో కడుక్కునే వాళ్లని తిడతారేమో అని ఎద్దేవా చేశారు. హార్వర్డ్ లో చదివిన తర్వాత అయినా లాగులో తొండలు, మెడలో పేగుల వంటి మాటలు బంద్ చేస్తాడేమో చూడాలని, లేకుంటే అక్కడ కూడా ఇంగ్లిషులో మాట్లాడే ప్రొఫెసర్లను విద్యార్థులను ఇక్కడ దూషించినట్లే దూషిస్తాడేమో అనిపిస్తుందన్నారు.
ఆయనకి ఇంగ్లిషు రాదు రావలసిన అవసరం లేదని పదే పదే చెప్తాడు కదా... మరిఆయన అక్కడ ఇంగ్లిషులో నేర్చుకునేది ఏమిటో సబ్మిట్ చేసేదేమిటో ఆయనకు సర్టిఫికెట్ ఎట్లా వస్తుందో తెలియదన్నారు.
రేవంత్‌రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉన్నది. దానిని అందరికీ అంటించాలని చూస్తున్నారు. అడ్డగోలు సిట్ విచారణల పేరుతో ఎన్నిరకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీలు, పరిపాలనా వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటాం.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్