21-01-2026 01:36:47 AM
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బహుజనులు కాలేదని, ఈసారి తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బహుజనడే కావాలి అనే నినాదంతో బీసీ లాయర్స్ అసోసియేషన్ కరపత్రాన్ని రిలీజ్ చేసింది. ఇది తెలంగాణలోని 110 బార్ అసోసియేషన్లకు పంపించారు. అక్కడ కూడా ఆ బార్ అసోసియేషన్ న్యాయవాదులు రిలీజ్ చేశారు.
బీసీ లాయర్స్ అసోసి యేషన్ జనరల్ సెక్రెటరీ పొన్నం దేవరాజ్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది లింగం వివేక్ సామ్రాట్ పత్రిక ఆవిష్కరణలో మాట్లాడారు. ‘బహుజన(బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ)లు ఈసారి మన ఓటు మన బహుజనుల ఓటు బహుజనులకే వేసుకుందాం. గత 78 సంవత్సరాలుగా మన తాతలు, తండ్రులు, మనము అగ్రకులాలకు ఓటు వేసిన పాపానికి ఈ న్యాయ రంగంలో ఏ ఒక్క శాఖలో కూడా మన జనాభా ప్రాతిపదికన జనాభా దామాషా నిష్పత్తి ప్రకారంగా మనకు రావాల్సినటువంటి మున్సిఫ్ కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టుల వరకు మన న్యాయవాదులకు ప్రాధాన్యత లేకుండా చేశారు.
కాబట్టి ఇకనైనా మేల్కొని రాబోయే రోజుల్లో మన వారిని బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నుకొని మనకు న్యాయ రంగంలో రావలసిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా వారి ద్వారా మన డిమాండ్లు సాధించుకునే విధంగా మనం ముందుకు వెళ్దాం. దయచేసి ఒక్క బహుజనుడు కూడా అగ్రకుల బార్ కౌన్సిల్ మెంబర్లకు ఓటు వేయమని మనకు మనంగా ప్రమాణం చేసుకొని ముందుకు పోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయవ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావచ్చు’ అని అన్నారు.