calender_icon.png 31 July, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిపడా ఎరువులు ఇస్తున్నాం

30-07-2025 01:41:47 AM

  1. కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా

లేదంటే మంత్రి తుమ్మల రాజీనామా చేస్తాడా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సవాల్

బీసీ రిజర్వేషన్లు కాదు, ముస్లింల రిజర్వేషన్లు అంటూ వ్యాఖ్యలు

ఖమ్మం, జూలై 29 (విజయక్రాంతి):రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కేంద్రం అందిస్తున్న సహాయాన్ని తక్కువ చూపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలు పూర్తిగా అసత్యం అని, పూర్తి లెక్కలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు.

తప్పని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. రైతుల మందులు బ్లాక్ మార్కెట్‌కి వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి చేతకాక అడ్డుకోలేకపోతున్నారని విమర్శించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహించారు.

అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. అవ సరానికి మించి యూరియా, డీఏపీ సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వంపై, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. 2024 రబీ సీజన్‌లో అవసరమైన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు బదులుగా కేంద్రం 12.47 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే 2.67 లక్షల టన్నులు అదనంగా పంపిందని వివరించారు. డీఏపీ విషయంలో అవసరమైన 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి 1.74 లక్షల మెట్రిక్ టన్నులు అందించిందని తెలిపారు.

ఈ ఏడాది కూడా అవసరమైన ఎరువులకన్నా ఎక్కువగానే అందించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గురించి చెపుతూ.. యూరియా బస్తా ఖరీదు రూ.1,690 కాగా, రైతు చెల్లించేది కేవలం రూ.266.50 మాత్రమే అన్నారు. మిగతా రూ.1423.50 కేంద్రం భరిస్తుందని తెలిపారు. డీఏపీ ధర రూ.2445.55 అయితే, రైతుకు గరిష్ఠ ధర రూ.1350 మాత్రమే అని వివరించారు.

కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్న కాంగ్రెస్, వాటిలో 10 శాతం ముస్లింలకు జోడించేందుకు కుట్ర చేస్తోందని రాంచందర్‌రావు ఆరోపించారు. ఇది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదు, ముస్లింల రిజర్వేషన్ బిల్లు అని విమర్శించారు. బీజేపీ మాత్రం బీసీలకు పూర్తిగా మద్దతుగా ఉన్నదని, రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ భేషరతుగా మద్దతిచ్చిందని చెప్పారు.

సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, తాండ్ర వినోద రావు, గేటేల విద్యాసాగర్, ఈవి రమేష్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, దేవకీ వాసుదేవరావు, సన్నీ ఉదయ ప్రతాప్, గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు.