30-07-2025 01:41:56 AM
భద్రాచలం మాజీ పార్లమెంట్ సభ్యుడు మిడియం బాబురావు
ముషీరాబాద్, జూలై 29(విజయక్రాంతి): ఆదివాసులను హిందూ మతంలో విలీనం చేయాలన్న ప్రయత్నం పూర్తిగా రాజకీయ లక్ష్యాలతో కూడినదనే విషయాన్ని ఆదివాసులు గ్రహించాలని భద్రాచలం మాజీ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిడియం బాబురావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 2027 జనాభా లెక్కల మతం కాలంలో షెడ్యూల్ ట్రైబ్ లేక ప్రకృతి ఆరాదకులుగా ప్రత్యేక క్యాటగిరిగా గిరిజన తెగలను గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనగణనలో షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయిం చాలానే అంశంపై సెమినార్ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి సంఘం పూసం సచిన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బాబురావు మాట్లా డుతూ.. ఆదివాసులను హిందూ మతంలో విలీనం చేయాలన్న ప్రయత్నం పూర్తిగా రాజకీయ లక్ష్యాలతో కూడినదనే విషయాన్ని ఆదివాసులు గ్రహించారన్నారు.
దేశవ్యాప్తంగా తమ మతాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్తో బలంగా ముందుకు వస్తున్నారని, ఇది సెంట్రల్ ఇండియాలో మరింత బలంగా ఉందన్నారు. 1951లో 18.4 లక్షల మంది ఓఆర్పీ కింద నమోదు కాగా, 2011లో ఇది 79.3 లక్షలకు పెరిగిందన్నారు. సర్ణాధర్మంగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 1991లో 18 లక్షల నుంచి 2011లో 35 లక్షలకు పెరిగిందని, సర్ణ ధర్మం, సర్ణ మతం లేదా పవిత్ర అడవుల మతం అని కూడా పిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘం పూసం సచిన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి కుమార్, ఎర్మ పున్నం, సహాయ కార్యదర్శులు ఆత్రం తనుష్, తొడసం శంబు, కోరేంగా మాలశ్రీ, దుగ్గి చిరంజీవి, అశోక్, భాగల రాజన్న తదితరులు పాల్గొన్నారు.