04-02-2026 12:53:58 AM
ప్రధాన పార్టీల పోటాపోటీతో ఆసక్తిగా మారిన కార్పొరేషన్ ఎన్నికలు
రాష్ట్ర నాయకుల భవిష్యత్ నిర్ణయించనున్న నిజామాబాద్ మేయర్ పీఠం
నిజామాబాద్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): ప్రధాన రాజకీయ పార్టీలు నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలోకి దిగాయి. గత పది సంవత్సరాలుగా ఒకరు ఇద్దరు అభ్యర్థులతో సరిపెట్టుకున్న కాంగ్రెస్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నిజామాబాదు నగర కార్పొరేషన్ పై జండా ఎగర వేయడానికి పకడ్బందీ ప్రణాళికలు చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన షబ్బీర్ అలీ ఓటమి పాలు అయ్యారు. ఎంపీ ఎమ్మెల్యే తో పాటు గత ఎన్నికల్లో అధిక మొత్తంలో సీట్లు దక్కించుకున్న బిజెపి మరింత గట్టిగా పని చేస్తూ కార్పొరేషన్ పై కచ్చితంగా తమ జండా ఎగరేస్తామని డంకా బజాయించి చెప్తోంది. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అభ్యర్థుల ఖరారు విషయమై ముందుగానే నిర్వహించిన సర్వేల ప్రకారం డివిజన్ల వారిగా అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది.
గత పది ఏండ్ల కు పైగా కార్పొరేషన్ లో అడపాదడపా ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ ప్రణాళికలతో అభ్యర్థులను బరిలోకి దింపింది. మరోవైపు మన సత్తా ఏంటో చూపే సమయం ఆసన్నమైందని మైనార్టీలంతా ఏకం కావాలని పతంగ్ పార్టీ పిలుపునిచ్చింది. ఆమెరకు తమ అభ్యర్థులను మైనార్టీ ప్రాబల్యంగల ప్రాంతాల్లో పోటీకి దింపింది. మేయర్ పోటి మాత్రం ముఖ్యంగా బిజెపి కాంగ్రెస్ మధ్యనే అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది నిజామాబాద్ బల్దియా బాద్షా పీఠం దక్కించుకోవడానికి ముఖ్య నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా, బిజెపి ఫైర్ బ్రాండ్ ఎంపీ అరవింద్ బిజెపి ప్రాబల్యం గల నిజామాబాద్ మేయర్ పీఠం చేజారి పోకుండా ఆచితూచి అడుగులు వేస్తు ప్రణాళికలు చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ఆసక్తిగా మారాయి. ఈ ఎన్నికలు రాష్ట్ర స్థాయి నాయకుల ప్రతిష్ట భవిష్యత్తును నిర్ణయించనున్నట్లు చెప్పవచ్చు. కార్పొరేషన్ ఎన్నికలు కార్పొరేషన్ అభ్యర్థుల ఖరారుకై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఎన్నికల ఇన్చార్జిగా నియమించింది.
మరోవైపు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని గత కార్పొరేషన్ ఎన్నికల్లో మున్సిపల్ లో గణనీయంగా కార్పొరేటర్ పదవులు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఖరారుకు ముందుగానే సర్వేలు నిర్వహించి అందిన సర్వేల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేసి రంగంలోకి దింపింది. నిజామాబాద్ నగర కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా 30 జనరల్ కాగా జనరల్ మహిళలకు 16 స్థానాలు దక్కనున్నాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కీలకమైన నిజామాబాద్ మేయర్ పదవి దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ సాయశక్తుల కృషి చేస్తున్నాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు స్థానికంగా పలుకుబడి ఆర్థిక పరిపుష్టి తో గల అభ్యర్థులను ఎంపిక చేసి రంగంలోకి దించాయి. నిజామాబాద్ నగరం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ బీసీల కు దక్కింది ఆ తర్వాత రెండు దఫాలుగా బీసీ మహిళ మెంబర్లు మేయర్ లయ్యారు.
ఈసారి జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ జనరల్ మహిళ కు అవకాశం దక్కింది. ఈ మేయర్ పదవి దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు సన్నద్ధ మయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వార్డుల వారీగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న చైర్మన్ లకు ప్రజాప్రతినిధులను ఇన్చార్జులుగా నియమించి వారి పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీదే అని తప్పకుండా గెలిపించుకురావాలని ఫత్వా జారీ చేసింది.