5 August, 2026 | 2:28 PM

చివరి గింజ వరకు కొంటాం

27-05-2024 12:45 AM

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్

నర్సాపూర్, మే 26 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజీరెడ్డి అన్నారు. ఆదివారం నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతో పని చేస్తున్నదని, గత సీజన్ కంటే వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, రైస్‌మిల్లర్లు కుమ్మక్కై రైతులను మోసం చేశారని ఎద్దేవ చేశారు.

తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా అమలు చేస్తుందని, జూలైలో ఎకరానికి రూ. 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సుహాసినీరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌గుప్తా, నాయకులు సురేశ్ నాయక్, అశోక్‌గౌడ్, నవీన్ గుప్తా, వెంకట్‌రెడ్డి, అజ్మత్ పాల్గొన్నారు.