calender_icon.png 9 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవికి బెయిల్ ఇవ్వలేం..

08-01-2026 01:46:20 AM

నిందితుడికి నాంపల్లి కోర్టు షాక్

  1. ఒకేసారి 5 బెయిల్ పిటిషన్లు కొట్టివేత
  2. విదేశీ పౌరసత్వం ఉంది..దేశం దాటి పోతాడని పోలీసుల వాదన
  3. ఏకీభవించి న్యాయస్థానం తీర్పు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జైలు నుంచి బయటపడేం దుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఐదు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.

బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు తమ వాదనలను బలంగా వినిపించారు. ఈ కేసు ప్రస్తుతం అత్యంత కీలకమైన దర్యాప్తు దశలో ఉన్నదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉన్నదని, బెయిల్ ఇస్తే దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉందని న్యాయస్థానానికి వివరించారు. నిందితుడు బయటకొస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు.

పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. రవి దాఖలు చేసిన ఐదు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. కాగా ఐబొమ్మ రవి కేవలం సినిమాలను పైరసీ చేయడం ద్వారా ఏకంగా రూ.13.40 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ సంపాదనపై పన్ను ఎగ్గొట్టేందుకు, పోలీసుల కంటపడకుండా ఉండేందుకు సుమారు రూ.90 లక్షల మొత్తాన్ని తన సోదరి ఖాతాలోకి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.