17 May, 2026 | 8:55 PM

అప్పులు చేసి సంపద సృష్టిస్తాం

20-06-2024 01:06 AM

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తాం

ఏటా రూ.20 వేల కోట్లు రుణాలు అందజేస్తాం 

రుణమాఫీపై ఎవరికీ అనుమానాలు వద్దు 

కేంద్ర బడ్జెట్ ఆధారంగానే రాష్ట్ర పద్దు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): అప్పులు చేసి సంపదను సృష్టిస్తాం. ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. మహిళా సంఘాలకు ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం మాట్లాడు తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్ష ల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంద ని, అందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని భట్టి పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కులగణన చేపట్టాలని, తద్వారా దేశ సంపదను, వనరులను ప్రజలకు పంచాలన్నారు. ప్రభుత్వ పాలనలోనూ ప్రజలను భాగస్యామ్యులను చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేసి ప్రభుత్వ ఫలాలను సమానంగా అందరికి పంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని భట్టి గుర్తుచేశారు. జనాభా దామాషా ప్రకారం సంపద, పదవులు పంచాలని రాహుల్ దేశమంతా పాదయాత్ర చేశారని తెలిపారు. రాష్ట్రంలో రాహుల్ ఆలోచనలను అమలు చేస్తున్నామని, పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమచారం అధిష్ఠానం వద్ద సమగ్రంగా ఉందని, త్వరలోనే పదవులు అందుతాయన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వం దేశానికి అవసరమన్నారు. 

విచారణ కోరింది జగదీశ్‌రెడ్డినే..  

కేంద్ర బడ్జెట్ ఆధారంగానే రాష్ట్రంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరగాలని నిండు శాసనసభలో నాటి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారని గుర్తుచేశారు.  విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశిస్తే.. బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తప్పు చేయకుంటే కమిషన్ వద్దకు వెళ్లి చెప్పొచ్చు కదా? అని భట్టి ప్రశ్నించారు. గత  బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాల అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌పై బీఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.

కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ నుంచి జస్టిస్ నర్సింహారెడ్డి తప్పుకోవాలనడం సరికాదన్నారు. ప్రాజెక్టుల విషయంలో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే కట్టాలని, ఏమీ తెలియని కేసీఆర్ కట్టారు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులను నిపుణుల సలహాతోనే చేస్తామన్నారు. మేడిగడ్డలో ఇసుక మేటలను తొలగిస్తేనే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.