23-11-2025 12:26:17 AM
హుస్నాబాద్ (విజయక్రాంతి) :‘గాయాల నుంచే గమ్యాన్ని వెతుక్కుం టాం. కగార్ కాటువేసినా కదం తొక్కుతాం. నరుకుతున్న కొద్దీ చిగురించే వృక్షంలా ఉద్యమాన్ని నిర్మించుకుంటాం. రాలిన ప్రతి నెత్తుటి చుక్కా రేపటి ఉద్యమ విత్తనమే’ అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ పేర్కొంది. దేశం లో మావోయిస్టు ఉద్యమం తన చరిత్రలోనే అత్యంత సంక్షోభ భరితమైన దశను ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆప రేషన్ కగార్’ (తుది పోరు) మావోయిస్టు పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.
ఈ విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అత్యున్నత దళమైన సెంట్ర ల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) స్వయంగా అంగీకరించింది. డిసెంబర్ 2 నుంచి 8 వర కు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) 25వ వార్షికోత్సవాలను జరుపుకోవాలని పిలుపునిస్తూ ఓ సుదీర్ఘ లేఖను శని వారం విడుదల చేసింది. అందులో పార్టీ ప్రస్తుత దయనీయ స్థితిని, నాయకత్వ లేమి ని, రహస్య వేడుకలు.. నూతన ఎత్తుగడల గురించి, అంతర్జాతీయ దృక్పథాన్ని సవివరంగా వెల్లడించింది.
నాయకత్వ లేమి.. దిగ్భ్రాంతికర గణాంకాలు
ముఖ్యంగా, పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు (బీఆర్) మరణించినట్టు ఈ లేఖ ద్వారా మావోయిస్టు పార్టీ అధికారికంగా ధ్రువీకరించింది. పార్టీ వ్యవస్థాపకుడు చారు మజుందార్ మరణం తర్వాత, ఇంతటి కీలకమైన నాయకుడిని కోల్పోవడం ఉద్యమానికి తీరని లోటని సీఎంసీ ఆవేదన వ్యక్తం చేసిం ది. గత 11 నెలల కాలంలో (డిసెంబర్ 2024 - నవంబర్ 2025) దేశవ్యాప్తంగా మొత్తం 320 మంది మావోయిస్టులు ప్రా ణాలు కోల్పోయారని గణాంకాలను బయటపెట్టింది.
మృతుల్లో బసవరాజుతో పాటు ఎనిమిది మంది కేంద్ర కమిటీ (సీసీ) సభ్యు లు, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉండ టం పార్టీ అగ్ర నాయకత్వ శూన్యతను సూచిస్తోంది. మరణించిన వారిలో 183 మంది పురుషులు కాగా, 117 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. ఈ నష్టాల్లో అత్యధికం దండకారణ్య ప్రాంతంలోనే సంభవించాయి.
సొంత మనుషుల ద్రోహం.. సిద్ధాంతపరమైన సమరం
పార్టీలో కీలక నేతలైన సోను, సతీష్ పోలీసులకు లొంగిపోవడాన్ని సీఎంసీ తీవ్రంగా పరిగణించింది. వారిని ‘విప్లవ ద్రోహులు’ గా, ‘విచ్ఛిన్నకారులు’గా అభివర్ణించింది. వారు లొంగిపోవడమే కాకుండా, పార్టీకి చెం దిన సుమారు 227 ఆయుధాలను శత్రువులకు అప్పగించారని మండిపడింది. ‘పార్టీ చట్టబద్ధ పోరాటాలను విస్మరించింది. అం దుకే లొంగిపోయాం’ అని సోను చేసిన వాదనను సీఎంసీ గట్టిగా తిప్పికొట్టింది.
తా ము కేవలం ఆయుధాలనే నమ్ముకోలేదని, గతంలో సింగూర్, నందిగ్రామ్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఏవోబీలో భూపోరాటాలు, పెసా (పీఈఎస్‌ఏ) చట్టం అమలు కోసం చేసిన పోరాటాలను ఉదహరిస్తూ.. తాము చట్టబద్ధ, బహిరంగ మార్గాలను కూ డా అనుసరించామని స్పష్టం చేసింది. సోను, సతీశ్ కేవలం ప్రాణభయంతోనే రివిజనిస్ట్ (మితవాద) వాదనలు చేస్తూ పారిపోయారని విమర్శించింది.
ఫాసిజం, ఎన్నికలు.. అంతర్జాతీయ కోణం
జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై కూడా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్’ శక్తిగా అభివ ర్ణించిన మావోయిస్టులు, దేశ ఎన్నికల వ్యవస్థపైనా విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓట్ల దొంగతనం జరిగిందని ఆరో పించారు.
మరోవైపు అంతర్జాతీయంగా పాలస్తీనాకు తమ మద్దతు ప్రకటించారు. గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ, అక్కడ మరణించిన 75 వేల మంది పాలస్తీనా ప్రజలకు విప్లవ జోహార్లు అర్పించారు.
అలాగే, పర్యావరణ విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పెట్టుబ డిదారీ విధానమే భూగోళ మనుగడకు ముప్పుగా మారిందని, పర్యావరణ పరిరక్షణ కూడా తమ పోరాటంలో భాగమేనని పేర్కొన్నారు. ఇక విదేశీ విధానంపై స్పందిస్తూ, రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ అమెరికా ఒత్తిడికి లొంగిపో యిందని, ‘ఆత్మనిర్భర్ భారత్’ అనేది బూటకమని విమర్శించారు.
రహస్య వేడుకలు.. నూతన ఎత్తుగడలు
చివరగా, ప్రస్తుతం పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, పీఎల్ జీఏ 25వ వార్షికోత్సవాలను బహిరంగంగా కాకుండా అత్యంత రహస్యంగా నిర్వహించుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్ద దళాలుగా కాకుండా చిన్నచిన్న బృందాలుగా విడిపోయి పనిచేయాలని, దెబ్బతిన్న దళాలను తిరిగి నిర్మించుకోవడానికి కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాలని సెంట్రల్ మిలిటరీ కమిషన్ సూచించింది. తాత్కాలిక వెనకంజలో ఉన్నప్పటికీ, కార్పొరేట్, ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని లేఖలో స్పష్టం చేసింది.
మేకల ఎల్లయ్య,
‘కగార్’ కల్లోలం..- వ్యూహాత్మక వైఫల్యాలు
‘ఆపరేషన్ కగార్’ పేరుతో ప్రభుత్వం చేపట్టిన భీకర దాడులే ఈ నష్టాలకు ప్రధాన కారణమని విశ్లేషిస్తూనే, తమ వ్యూహాత్మక వైఫల్యాలను కూడా పార్టీ అంగీకరించింది. కేం ద్ర కమిటీ నిర్దేశించిన గెరిల్లా యుద్ధ ని యమాలను క్షేత్రస్థాయిలో పాటించకపోవడం, భా రీ దాడుల సమయంలో బలగాల ను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలం కావ డం వల్ల తీవ్ర మూల్యం చెల్లించుకున్నామని పేర్కొంది.
అయితే, ఈ దాడు లను ప్రతిఘటించే క్రమంలో తాము చేసిన ఎదురుదాడుల్లో (ఐఈడీలు, ఆంబుష్లు) 116 మంది భద్ర తా బలగాలను మట్టుబెట్టామని, 208 మందిని గాయపరిచామని లేఖలో పేర్కొన్నారు.