23-11-2025 12:22:15 AM
‘గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్’ పేరిట వ్యవస్థ ఉండాలి
ప్రకృతి విపత్తుల వేళ, ఆరోగ్య సంరక్షణకు అది ఉపయోగపడాలి
మానవాళి శ్రేయస్సు కోసం ‘గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ’ ఏర్పాటు చేయాలి
ఆఫ్రికాకు ‘స్కిల్స్ మల్టీప్లుయర్ ఇనిషియేటివ్’ అవసరం
పది లక్షల మంది శిక్షకులను సిద్ధం చేయడమే లక్ష్యం
దక్షిణాఫ్రికా ‘జీ20’ సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రతిపాదనలు
జోహన్స్‌బర్గ్, నవంబర్ 22: డ్రగ్స్‌నిర్మూలన, ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటం అవసరమని భార ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా శనివారం అట్టహాసంగా 20వ జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ముందుగా చైనా, భారత్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల అధినేతలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఘన స్వాగతం పలికారు. అనంతరం ‘వెనుకడుగు లేని సమ్మిళిత స్థిరమైన ఆర్థిక వృద్ధి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
ప్రపంచంలో ఎక్కడా మాదక ద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి చోటివ్వొద్దని, ఆ రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు అంశం ప్రపంచానికి పెద్ద సవాలుగా మారిందన్నారు. ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాల ఉనికి లేకుండా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక వనరులు అందకుండా అన్ని దేశాలు కలిసి పని చేయాలని పేర్కొన్నారు.
మానవాళి శ్రేయస్సు కోసం ‘జీ20’ ఒక గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. యేటా అనేక దేశాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని, కొన్ని దేశాల పౌరులు ఆరోగ్యపర మైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని..
ఆ సమయంలో బాధిత దేశాలకు బాసట అందించేందుకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ‘గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్’ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకు భారత్‌లోని ‘ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్’ ఉపకరిస్తుందన్నారు. పర్యావరణ సమతుల్యత అంశాన్ని ప్రతి దేశమూ పట్టించుకోవాల్సి అవసరం ఉంద ని వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణతోనే ఆయా దేశాల ప్రజల ఆరోగ్య సంరక్షణ సాధ్యమవుతుందన్నారు.
ఆఫ్రికాకు అండగా భారత్
ఆఫ్రికాకు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. జీ20 సమావేశాల్లోనే ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యదేశంగా భారత్‌కు అవకాశం రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ‘జీ20- ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లుయర్ ఇనిషియేటివ్’ను భారత్ ప్రతిపాదిస్తోందని పేర్కొన్నారు.
రానున్న పదేళ్లలో ఆఫ్రికాలో పది లక్షల మంది శిక్షకులను తయారు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. సమగ్ర మానవతావాదం భారతదేశ నినాదమని, అది గొప్ప ఆచరణీయమార్గమని అభివర్ణించారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో భారత్ ముందంజలో ఉందన్నారు.
మళ్లీ ‘మెలడీ’ చిరునవ్వులు
జీ20 సదస్సు ప్రారంభానికి ముందు భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి ఎదురుపడ్డారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుక రించుకుంటూ చిరనవ్వు లు చిందించారు. వీరిద్దరి ఫొటోలు మరోసారి వైరల్ అయ్యాయి. 2023 డిసెంబర్ లో ఇరు దేశాధినేతలు తొలిసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్28’ సదస్సులో సెల్ఫీ తీసుకోవడం,
ఆ తర్వాత సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సందర్భంలోనే వారిద్దరికీ ‘మెలడీ’ (ఇద్దరి పేర్లు కలిసేలా) అనే హ్యాస్‌టాగ్ తెరమీదకు వచ్చింది. మోలోని ఇటీవల విడుదల చేసిన ఆత్మకథ పుస్తకానికి మోదీ ముందుమాట రాయడంతో మరోసారి వారిద్దరూ వార్తల్లోకెక్కారు. తాజాగా జీ 20 సదస్సులోనూ కలుసుకోవడం నెటిజన్లను ఆకర్షించిందిఆకర్షించింది .
ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ
భారత ప్రధాని మోదీ జీ20 సదస్సులో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వుపాక్షిక సంబంధాల బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. రక్షణ వ్యవ స్థ, దేశాల భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఖనిజాలు, విద్య, సాంకేతికత వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం విస్తరించుకునే మార్గాలను సమీక్షించారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని మోదీ ఆస్ట్రేలియా అల్బనీస్‌ను కోరారు. సౌదీ అరేబియాలో సంభవించిన బస్సు ప్రమాదంలో 40 మందికిపై మృతిచెందడంపై అల్బనీస్ తన సంతాపం తెలియజేశారు.