ట్రైలరే చూపించాం..సినిమా ముందుంది!
- కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేసేంతవరకు ఆందోళన ఆగదు
- సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
- ఈ నెల 13న భారీ నిరసన చేపడతాం
ముంబై, జూన్ 7: బొద్దింకలు ఏం చేయగలవో కేంద్ర ప్రభుత్వానికి ట్రైలర్‌ను మాత్రమే చూపించామని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు తమ ఆందోళన ఆగదని సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. శనివారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన అనంతరం ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ వలుజ్ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు.
అక్కడ అభిజిత్‌కు కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం తన ఎక్స్‌లో పలు విషయాలను దీప్కే రాసుకొచ్చాడు. న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలు గొప్ప విజయం సాధించిందని పేర్కొన్నారు. శాంతియుత నిర సనలతో ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపించామన్నారు. ఈ ఉద్యమం ఇకపై దేశవ్యాప్తంగా విస్తృతపరుస్తామని స్పష్టం చేశా రు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకతరానికి మొత్తం అన్యాయం చేశారని, దీనిపై కేవలం మనం గళం విప్పితే మార్పు రాదన్నారు.
ఆయన రాజీనామా చేయకుంటే జూన్ 13న భారీ నిరసన చేపడతామన్నారు. విద్యావ్యవస్థపై ఉన్న కోపాన్ని, నిరాశను యువత తమ నిరసనలో వ్యక్తం చేస్తూ ధైర్యం చేశారని కొనియాడారు. ఎర్రటి ఎండలో సైతం విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టడమే మనందరి గొప్పబలంగా అభి వర్ణించారు. సీజేపీ నిరసనలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శాంతియుత నిరసనను వ్యక్తం చేస్తూ మనం అనుకున్నది సాధించుకుంటే ఏ ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. సీజేపీ పార్టీకి మద్దతిచ్చే, కలిసివచ్చే వారు ఎవ్వరికీ భయపడనవసరం లేదని అభిజిత్ దీప్కే ఆ పోస్టులో స్పష్టం చేశారు.






