8 June, 2026 | 3:38 AM

పొరుగు దేశాలతో పోలిస్తే ధర అగ్గువే!

08-06-2026 01:36 AM

ఒక్కో సిలిండర్ సరఫరాపై రూ.౧,౬౦౦ ఖర్చు

కేంద్రమే రూ.౭౦౦ వరకు భారం మోస్తున్నది.. 

డొమెస్టిక్ సిలిండర్ ధర పెంపును సమర్థించుకున్న కేంద్రం

న్యూఢిల్లీ, జూన్ 7: గృహ వినియోగ ఎల్పీజీ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో సిలిండర్ ధరల కంటే భారత్‌లో తక్కువ ధరకే సిలిండర్ అందిస్తున్నామని ఆదివారం పేర్కొంది. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలను రూ. 29 పెంచుతున్నట్లు శనివారం అర్థరాత్రి ప్రభుత్వం ప్రకటించింది.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్ రూ. 642కు లభించనుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో చెల్లించే ధర కంటే చాలా తక్కువ ధరకే మనకు గ్యాస్ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పెంపుతో ఢిల్లీలో రూ. 913 ఉన్న సిలిండర్ ధర రూ. 942కు చేరింది. గత మూడు నెలల్లో రూ. 89 పెంచింది. పశ్చిమాసియా, హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల వల్ల ఎల్పీజీ ధరల పెరుగుదలకు కారణమని కేంద్రం తెలిపింది.

భారత్ తన ఎల్పీజీ అవసరాలలో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. సంక్షోభం తీవ్రతరం అయినప్పటి నుంచి ప్రస్తుతం వరకు ఎల్పీజీ బెంచ్ మార్క్ 46 శాతం పెరిగిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పెరుగుదల వల్ల గృహ వినియోగ సిలిండర్ సరఫరా ఖర్చు రూ. 1600 దాటిందని, అయినా ప్రభుత్వం ప్రజలను దృష్టిలో ఉంచుకొని స్వల్ప పెరుగుదలకు నిర్ణయించిందని తెలిపింది. ప్రతీ సిలిండర్‌పై రూ. 700 భారాన్ని ప్రభుత్వమే మోస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఉజ్వల యోజన కింద 10.58 కోట్ల లబ్ధిదారులకు ప్రతీయేటా నాలుగు సిలిండర్‌కు రూ. 300 సబ్సిడీని అందజేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  గృహాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి కీలక సేవలకు ఎల్పీజీ సరఫరాకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు రూ. 60వేల కోట్ల భారాన్ని భరించాయని, అంతక్రితం రూ. 41,338గా ఉందని స్పష్టం చేసింది. సంస్థలకు రూ. 30వేల కోట్ల పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా ముందుకు వెళుతుందని స్పష్టం చేసింది.