యువత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే వీ హబ్
సూర్యాపేట, ఆగష్టు 4 (విజయక్రాంతి): జిల్లాలో యువత, మహిళల సృజనాత్మకతను వెలికితీస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ’వీ-హబ్’ సరికొత్త జాతీయ స్థాయి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన వీ-హబ్ పోస్టర్ను ఆవిష్కరించారు.
గ్రామీణ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ’గ్రాస్రూట్స్ యూత్ ఇన్నోవేషన్’, టైర్-2, 3 నగరాల్లోని మహిళలు, వెనుకబడిన వర్గాల కోసం ’సోషల్ ఇంపాక్ట్, ఆంత్రప్రెన్యూర్షిప్’ పేర్లతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
17 నుంచి 23 ఏళ్ల వయస్సుగల విద్యార్థులకు హ్యాకథాన్లు, ఐడియాషన్ సెషన్లతో పాటు 12 వారాల ఇంటర్న్షిప్, ప్రొటోటైప్ తయారీకి మార్గదర్శకత్వం అందిస్తామన్నారు. అలాగే మహిళలకు ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత రంగాల్లో బిజినెస్ బేసిక్స్, డిజిటల్ నెట్వర్కింగ్, ఫండింగ్, లీగల్ సపోర్ట్ వంటి సేవలు అందజేస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు www.wehub.telangana.gov.in వ్బుసైట్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ సన్యాసయ్య, డీఈవో అశోక్, మెప్మా పీడీ శ్రీనివాస్, వీ-హబ్ సీఈఓ సీతా పళ్ళచుని తదితరులు పాల్గొన్నారు.






