19 July, 2026 | 2:11 AM

యువ సంగ్రామ సదస్సుకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్ నేతలు

19-07-2026 12:00 AM

హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ : మాగంటి సునీత

జూబ్లీహిల్స్, జూలై 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ ద్వంద్వ నీతిని ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం యువ సంగ్రామ సదస్సును నిర్వహించిందని తెలిపారు. సరూర్ నగర్ లో శనివారం జరిగిన సదస్సుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ గులాబీ శ్రేణులు దండులా కదలివెళ్లారు. పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంచార్జి మాగంటి సునీత గోపీనాథ్ నాయకత్వంలో భారీ ర్యాలీగా సరూర్ నగర్ చేరుకున్నారు.

ఈ విషయమై మాగంటి సునీత మాట్లాడుతూ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగ యువతకు రూ.4వేల భృతి,విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీనిచ్చిందన్నారు.యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ విద్యార్థులను, యువతను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి పార్టీకి ప్రజలంతా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కేటీఆర్ నాయకత్వంలో తామంతా దండై కదులుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.