25 March, 2026 | 2:11 AM

కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి

25-03-2026 12:00 AM

కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు 

 విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ 

నిజామాబాద్, మార్చి 24 (విజయ క్రాంతి): నేత్ర సమస్యలను అశ్రద్ధ చేయకూడదని, శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి బాలబాలికలకు కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కంటి చూపు మందగించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆకు కూరలు, క్యారెట్ వంటి వాటిని ఆహార పదార్థాలలో భాగం చేసుకోవాలని సూచించారు. ఇదివరకు తాను కూడా దృష్టి లోపంతో ఇబ్బందిపడ్డానని, తగిన వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లతో ఆ సమస్యను అధిగమించానని కలెక్టర్ వెల్లడించారు.

కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లాలో సుమారు 70 వేల మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 41 వేల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగానే అవసరం అయిన వారికి అంధత్వ నివారణ సంస్థ ద్వారా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేత్ర పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా కంటి సంబంధిత సమస్యలకు సంబంధించిన అంశాలపై విద్యార్థిని, విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ, సరైన సమాధానాలు చెప్పిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగస్వాములం అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

అంతకుముందు పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అశ్విని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ పీ.ఓ డాక్టర్ సుజాత, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.